Insurance | బీమాతో వచ్చే భరోసానే వేరు. ప్రధానంగా ఓ మంచి ఆరోగ్య బీమా పాలసీ.. అత్యవసర సమయాల్లో కొండంత అండగా నిలుస్తుంది. అయితే అదే పాలసీ.. సరైన కవరేజీ ఇవ్వకున్నా, సదరు బీమా సంస్థ సేవలు అసంతృప్తికరంగా ఉన్నా అనవసరపు భారమే అవుతుంది. అందుకే మన అంచనాలకు తగువిధంగా లేని ఆరోగ్య బీమా పాలసీలను పోర్టబిలిటీ ద్వారా మార్చుకునే సౌలభ్యం ఇప్పుడున్నది. అది ఎలాగో మీకు తెలుసా?
ఆరోగ్య బీమా పోర్టబిలిటీ.. పాలసీదారులకు తమ ప్రస్తుత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని బీమా ప్రయోజనాలు ఏ రకంగా దెబ్బతినకుండా మరో కొత్త ఇన్సూరర్‌కు మార్చుకునేలా సహాయపడుతుంది. నో-క్లెయిం బోనస్, వెయిటింగ్ పీరియడ్ క్రెడిట్, ఇతర లాభాలను యథతథంగా ఉండేలా చేస్తుంది. ఉదాహరణకు మీకు ఓ రూ.10 లక్షల ఆరోగ్య బీమా ఉన్నది. ఎన్నో ఏండ్లుగా దీనికి ప్రీమియంలు చెల్లిస్తూనే ఉన్నారు. క్రమేణా ఆ ప్రీమియంలు పెరుగుతున్నా.. మీకు మీ బీమా సంస్థ క్లెయింలను సెటిల్మెంట్ చేస్తున్న తీరు మాత్రం నచ్చడం లేదు. ఈ సమయంలోనే రూ.15 లక్షల కవరేజీతో మరో బీమా సంస్థలో ఓ పాలసీ మీ దృష్టికొచ్చింది. పైగా దీనికి ఇప్పుడున్న ప్రీమియంల కంటే తక్కువే. దాంతో కొత్త పాలసీకి మారాలనుకున్నారు. అప్పుడు పోర్టబిలిటీ సదుపాయాన్ని ఎంచుకోవచ్చు. దీనివల్ల మీ బీమా కవరేజీ రూ.10 లక్షల నుంచి 15 లక్షలకు పెరుగుతుంది. పాత పాలసీలో ఏవైనా నో-క్లెయిం బోనస్లున్నా అవీ వర్తిస్తాయి. అలాగే ప్రీమియంలూ తగ్గుతాయి. నెట్వర్క్ హాస్పిటల్స్, మెటర్నిటీ లేదా తీవ్ర అనారోగ్య సమస్యల కవరేజీ కూడా బాగుంటుంది.
ప్రస్తుత పాలసీ గడువు ముగియడానికి కనీసం 45 రోజుల ముందుగానే మీరు కోరుకున్న కొత్త సంస్థకు బీమా పోర్టబిలిటీ విజ్ఞప్తిని చేసుకోవడం మంచిది.
పోర్టబిలిటీ ద్వారా ఆన్లైన్లో ఆరోగ్య బీమాను తీసుకోవాలనుకుంటే ప్రీమియం రేట్లు, కవరేజీ, నెట్వర్క్ హాస్పిటల్స్, క్లెయిం సెటిల్మెంట్ రేషియో వంటివి వివిధ సంస్థల్లో ఎలా ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలించండి. ఇందుకోసం ఆయా సంస్థల వెబ్సైట్లు, మొబైల్ యాప్స్‌ను వాడుకోండి.
పోర్టబిలిటీ ఫారంలో మీ ఆరోగ్య సమస్యల వివరాలు, ప్రస్తుత పాలసీ, గత క్లెయింలు తదితర సమాచారాన్ని దాచకుండా ఇవ్వండి.
సంప్రదాయ పద్ధతిలో మీ ప్రస్తుత బీమా పాలసీని ఇతర సంస్థల్లోకి మార్చుకోవాలనుకుంటే ఆయా కంపెనీల ఆఫీసులను సంప్రదించడం ఉత్తమం.