Piyush Goyal | వివిధ వర్గాల ప్రజలకు ఉచిత పథకాలు, ప్రజాకర్షక పథకాలపై కేంద్ర మంత్రులు నిరంతరం తమ వ్యతిరేకతను బహిరంగ పరుస్తూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఉచిత పథకాల వల్ల భవిష్యత్ తరాలపై భారం పడుతుందని వ్యాఖ్యానిస్తే.. ఆ జాబితాలోకి కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ వచ్చి చేరారు. ప్రజాకర్షక పథకాలు, ఉచిత పథకాల వల్ల దీర్ఘకాలంలో దేశానికి నష్టం చేకూరుస్తాయని వ్యాఖ్యానించారు. ‘ఒకవేళ మనం ప్రజాకర్షక పథకాలు అమలు చేస్తే, మన దేశాన్ని కష్టాల్లోకి నెట్టేస్తాయి. స్వల్ప కాలికంగా మంచిగానే కనిపించొచ్చు. కానీ, దీర్ఘకాలికంగా దేశానికి నష్టం కలుగుతుంది’ అని శనివారం ఓ చర్చాగోష్టిలో పీయూష్ గోయల్ చెప్పారు.
తమ ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి ఇన్సెంటివ్ లు ఇవ్వడం ద్వారా యువతకు సాధికారత కల్పించడంపై దృష్టి సారించిందన్నారు. నైపుణ్యాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం రూ.2 లక్షల కోట్ల నిధులను బడ్జెట్ లో కేటాయించిందని తెలిపారు. దీనివల్ల యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. క్యాపిటల్ గెయిన్ టాక్స్ పెంచడం వల్ల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ)పై ఎటువంటి ప్రభావం ఉండబోదని స్పష్టం చేశారు. ’బడ్జెట్ ప్రతిపాదనల్లో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెంచడంపై తలెత్తిన భయాలను నిలిపేయాల్సిన అవసరం ఉంది. పెట్టుబడి లాభాలిచ్చే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరినీ నిలువరించడం లేదు’ అని అన్నారు. ఏంజిల్ ట్యాక్స్ రద్దుతో దేశీయంగా స్టార్టప్ ఎకో సిస్టమ్ బలోపేతం అవుతుందన్నారు. దీనివల్ల స్టార్టప్ లను, పెట్టుబడులను ప్రోత్సహించడానికి వీలవుతుందని చెప్పారు. 2030 నాటికి రెండు లక్షల కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.