Gen Z Trends : అంబరాన్నంటే ఆత్మవిశ్వాసం, డిజిటల్ నైపుణ్యాల్లో ఆరితేరిన నేటి యువత రొటీన్ 9 టూ 5 జాబ్లకు చెల్లుచీటీ ఇస్తోంది. పాత తరంలా సంప్రదాయ కొలువులకు పరిమితం కాదలచుకోకకుండా వ్యాపారాల్లో సత్తా చాటాలని, తమకు తామే బాస్లుగా ఉంటామని జనరేషన్ జడ్ చెబుతోందని తాజా సర్వే స్పష్టం చేసింది. ఇతరుల కోసం పనిచేయడం కంటే తమ సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికే యువత మొగ్గుచూపుతున్నదని న్యూ పోల్ వెల్లడించింది.
తమకు తామే బాస్లుగా ఉండటమే ఇష్టమని నాలుగింట మూడొంతుల యువత తెలిపిందని సాంటాండర్ యూకే పరిశోధనలో వెల్లడైంది. కొత్త వ్యాపారాన్ని లాంఛ్ చేసి విజయవంతంగా నడిపిస్తామనే విశ్వాసం తమకుందని 77 శాతం యువత వెల్లడించింది. తమ స్మార్ట్ఫోన్ నుంచే వ్యాపారాలకు శ్రీకారం చుడతామని 39 శాతం మంది చెప్పుకొచ్చారు. తాము డిజిటల్ యుగంలో పెరగడంతో వ్యాపారం ప్రారంభించడం తమకు కలిసివచ్చే అంశమని అధ్యయనంలో పాల్గొన్న వారిలో సగం మంది అభిప్రాయపడ్డారు.
జన్ జడ్, మిలీనియల్స్కు వ్యాపారం ప్రారంభించడం సులుభతరమని వారు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తాము కెరీర్ ప్రారంభదశలో ఉన్నప్పుడు వ్యాపారాలు ప్రారంభించడం అనేది చిన్నవిషయం కాదని, అప్పట్లో సంప్రదాయ విద్య, కెరీర్లో ముందుకెళ్లడం వంటివి విధిగా పాటించాలనే ఒత్తిడి ఉండేదని జెన్ ఎక్స్, బేబీ బూమర్స్ చెప్పుకొచ్చారు.
వ్యాపార స్ఫూర్తిలో జన్ జడ్ ముందువరసలో ఉందనేది నిరూపితమైందని సర్వేలో పలువురు పేర్కొన్నారు. డిజిటల్ యుగంలో పెరగడంతో వారికి సమాచారం, టూల్స్, గ్లోబల్ కనెక్షన్స్ ఒక్క క్లిక్ దూరంలో ఉన్నాయి. ఇవన్నీ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలేనని, వారు తమ ఐడియాలను సులభంగా అమలు చేసే సత్తాను కూడా కలిగిఉన్నారని డ్రాగన్స్ డెన్ స్టార్, జీనర్8 ఫౌండర్ శాం జోన్స్ చెప్పుకొచ్చారు.
Read More :
RTC Drivers | ప్రయాణికులముందే తన్నుకున్న ఆర్టీసీ డ్రైవర్లు.. ఇద్దరిపై చర్యలకు సిఫారుసు