Cyber Fraud | పెరుగుతున్న టెక్నాలజీకనుగుణంగా ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సైబర్ మోసగాళ్లు రోజుకో ట్రిక్‌తో సాధారణ వ్యక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. సైబర్ సెల్, పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ పుణెకు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ సైబర్ మోసానికి బలైపోయాడు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినందుకు ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.2.3 లక్షలు మాయం అయ్యాయి.
పుణె రూరల్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న కానిస్టేబుల్ సస్వద్ లోని బేకరీ బిల్లు చెల్లించడానికి ప్రయత్నించాడు. ట్రాన్సాక్షన్ పూర్తి కావడానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమన్నారు బేకరీ నిర్వాహకులు. ఆయన క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసిన కొన్ని క్షణాల్లో కానిస్టేబుల్ సేవింగ్స్ ఖాతా నుంచి రూ.18,755 డెబిట్ అయ్యాయి. ఆ వెంటనే అప్రమత్తమైన పోలీసు తన ఇతర బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకుని షాక్‌కు గురయ్యారు. ఇతర బ్యాంకు ఖాతాల నుంచి రూ.12,250 ఖాళీ అయింది. ఆ తర్వాత కొద్ది సేపటికి బంగారం రుణం ఖాతా కింద వన్ టైం పాస్ వర్డ్ నోటిఫికేషన్ రావడం రూ.1.9 లక్షల చెల్లింపులు జరిగిపోయాయి. ఆయన క్రెడిట్ కార్డు వివరాలను వాడి రూ.14 వేలు విత్ డ్రా చేశారు సైబర్ మోసగాళ్లు.
దీంతో కానిస్టేబుల్ అప్రమత్తమై తన బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డులను ఫ్రీజ్ చేయాలని బ్యాంకు అధికారులను కోరాడు. పోలీసుల దర్యాప్తులో తేలిందేమిటంటే.. ఆయన మొబైల్ ఫోన్ లో మోసపూరిత ఏపీకే ఫైల్ మోసగాళ్లు ఇన్ స్టాల్ చేసి, ఆయన డబ్బంతా స్వాహా చేశారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పద ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసే విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు తెలిపారు. మనీ పొందే వ్యక్తి పేరు చెక్ చేసుకోవాలని పేర్కొన్నారు. అనుమానాస్పద లింక్‌లు క్లిక్ చేయొద్దని చెబుతున్నారు.