హైదరాబాద్, మే 1: తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల రక్షణ (ప్రత్యక్ష అమ్మకాల పర్యవేక్షణ, నియంత్రణ) మార్గదర్శకాలు-2025ను వ్యాపార, పారిశ్రామిక వర్గాలు తప్పుబడుతున్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థలో ఇటీవలి గైడ్‌లైన్స్ అనిశ్చిత పరిస్థితికి దారితీయవచ్చన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. లక్షలాది మందికి, ప్రధానంగా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న ఈ పరిశ్రమకు ఇది దెబ్బేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సిస్టమ్‌పై ఆధారపడ్డవారి జీవనోపాధికి, వ్యవస్థాపకతకు ఈ మార్గదర్శకాలను అంతరాయంగానే అభివర్ణిస్తున్నారంతా. వినియోగదారుల రక్షణను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామంటూనే.. గతంలో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన వినియోగదారుల రక్షణ (డైరెక్ట్ సెల్లింగ్) నిబంధనలు-2021కు విరుద్ధంగా గైడ్‌లైన్స్‌ను రూపొందించారని తీవ్ర స్థాయిలో అభ్యంతరాలను వెలిబుచ్చుతున్నారు.
వ్యాపారం నిర్వీర్యం
రేవంత్ సర్కార్ ప్రకటించిన ఈ మార్గదర్శకాలతో వ్యాపారావకాశాలు దూరమవుతాయన్న ఆవేదన ఇండస్ట్రీలో కనిపిస్తున్నది. ఈ గైడ్‌లైన్స్ ప్రకారం.. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి రిజిస్ట్రేషన్ చేయడానికి ముందు మానిటరింగ్ అథారిటీ పోలీస్ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) పొందాల్సి ఉంటుంది. ఇది పోలీసుల జోక్యాన్ని పెంచుతున్నదని, కన్జ్యూమర్ అఫైర్స్ ఇతర అవసరమైన శాఖల ప్రాధాన్యతను తగ్గిస్తున్నదని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. అథారిటీపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికే ఇదంతా అని విమర్శిస్తున్నారు. మానిటరింగ్ అథారిటీకున్న చట్టబద్ధతను గౌరవించాల్సిందిపోయి.. లీగల్‌గా కార్యకలాపాలు సాగిస్తున్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల రిజిస్ట్రేషన్‌ను మార్గదర్శకాల పేరిట రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నదంటూ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార రంగంలో ఈ మార్పు ఆంత్రప్రెన్యూర్షిప్ను బలహీనపరుస్తున్నదని అంటున్నారు. ఫలితంగా డైరెక్ట్ సెల్లింగ్ స్వభావమే మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాగా, మానిటరింగ్ అథారిటీలో సీనియర్ పోలీసు ప్రాతినిధ్యం ఇప్పటికే ఉన్నప్పుడు.. నిపుణులు రెగ్యులేటరీ వెరిఫికేషన్‌ను వృత్తిపరమైన నైపుణ్యం ద్వారా సంస్థాగత యంత్రాంగాలతోనే మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చన్న అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
పెట్టుబడులపై ప్రభావం
డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్గదర్శకాలు తెలంగాణలో పెట్టుబడులకున్న నూతన అవకాశాలను దెబ్బతీసేలా ఉన్నాయన్న ఆందోళన కనిపిస్తున్నది. ఇటీవల ఓ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ పోలీస్ కేసులో ఇరుక్కోవడం, కంపెనీ ఉద్యోగి తప్పు లేకున్నా.. పోలీసుల అదుపులో ఉండటం ఒకింత కలవరపాటుకు గురిచేసింది. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగానే పనిచేస్తున్నామని ఆ సంస్థ చెప్తున్నది. మొత్తానికి ఈ మార్గదర్శకాలు ఇబ్బందికరంగా మారుతుండటంతో.. పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు అడ్డంకిగా ఉన్నాయంటున్నారు.
ఈ మార్గదర్శకాల వల్ల ఏర్పడే ప్రతికూలాంశాలు
డైరెక్ట్ సెల్లింగ్ అంటే?
భారత్‌లో డైరెక్ట్ సెల్లింగ్ చట్ట సమ్మతమే. ఇదో పర్సన్-టు-పర్సన్ సెల్లింగ్ సిస్టమ్ (పీటుపీ విక్రయ విధానం). సంప్రదాయ రిటైల్ దుకాణాల ప్రమేయం లేకుండా వస్తూత్పత్తి సంస్థలే నేరుగా లేదా స్వతంత్ర కాంట్రాక్టర్ల ద్వారా తమ వస్తువులను మార్కెటింగ్ చేస్తూ వినియోగదారులకు విక్రయిస్తూ ఉంటాయి. ఎక్కువగా ఒక కస్టమర్ నుంచి మరో కస్టమర్‌కు వ్యాపారాన్ని విస్తరించుకుంటూపోతాయి. ఆమ్వే, హెర్బల్లైఫ్, ఎవాన్, టప్పర్‌వేర్ తదితర సంస్థలు ఈ కోవలోకే వస్తాయి. గత ఆర్థిక సంవత్సరం (2025-26) దేశీయ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ టర్నోవర్ రూ.30,000 కోట్లపైనే. గడిచిన దశాబ్దకాలంలో 10 రెట్లు పెరుగడం గమనార్హం. పన్నుల రూపంలోనే ఖజానాకు ఈ పరిశ్రమ ఏటా రూ.3,600 కోట్లు చెల్లిస్తున్నది. వెల్నెస్, కాస్మోటిక్స్, పర్సనల్ కేర్ ఉత్పత్తులు, మహిళా ఆంత్రప్రెన్యూర్షిప్లే ఈ ఇండస్ట్రీకి ప్రధాన బలం అని చెప్పవచ్చు.