న్యూఢిల్లీ, జనవరి 2: ప్రభుత్వరంగ బ్యాంకులు రుణ వితరణలో దూసుకుపోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం)లు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో పీఎన్బీ రుణ వితరణ ఏడాది ప్రాతిపదికన 13.5 శాతం పెరిగి రూ.9.72 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసింది. ఏడాదిక్రితం ఇచ్చిన రుణాలు రూ.8.56 లక్షల కోట్లుగా ఉన్నాయి. డిపాజిట్లు ఏడాది ప్రాతిపదికన 9.4 శాతం అధికమై రూ.12.10 లక్షల కోట్ల నుంచి రూ.13.23 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మరో సంస్థయైన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ.1.88 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో మంజూరు చేసిన రూ.1.56 లక్షల కోట్ల కంటే ఇది 20. 28 శాతం అధికమని పేర్కొంది. అలాగే డిపాజిట్లు రూ.2.08 లక్షల కోట్ల నుంచి రూ.2.45 లక్షల కోట్లకు పెరిగాయి.