ముంబై, మే 11: రత్నాలు, ఆభరణాల పరిశ్రమలో భయాందోళనలు నెలకొన్నాయి. కనీసం ఏడాదిపాటు బంగారం కొనుగోళ్లను దేశ ప్రజలు వాయిదా వేయాలంటూ సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే సూచించడం.. ఇండస్ట్రీని ఒక్కసారిగా కలవరపాటుకు గురిచేసింది. దేశీయ దిగుమతుల్ని తగ్గించేందుకు, ఫారెక్స్ నిల్వలపై ఒత్తిడిని పరిమితం చేసేందుకు.. పుత్తడి వినిమయాన్ని కట్టడి చేయడమే మార్గమని మోదీ ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై అఖిల భారత రత్నాలు, ఆభరణాల మండలి (జీజేసీ) అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. పసిడి కొనుగోళ్లు ఆగిపోతే అనేక రంగాలు ప్రభావితమవుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థపైనా ఆ భారం గట్టిగానే పడే అవకాశాలున్నాయని జీజేసీ చైర్మన్ రాజేశ్ రోక్డే సోమవారం అన్నారు.
దేశ ప్రజలు పసిడి కొనుగోళ్లకు దూరం జరిగితే.. కేవలం రత్నాలు, ఆభరణాల ఇండస్ట్రీనేగాక, అనేక రంగాలు ప్రభావితమవుతాయని జీజేసీ అంటున్నది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగాలతోపాటు రిటైల్, ఈ-కామర్స్, జ్యుయెల్లరీ డిజైనింగ్, లాజిస్టిక్స్ తదితర రంగాలు సైతం దెబ్బతింటాయని గుర్తుచేసింది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్లాది మందికి ఉపాధి కరువయ్యే ప్రమాదం ఉందని కూడా జీజేసీ హెచ్చరించడం గమనార్హం. ‘మేము ప్రధాని వ్యాఖ్యలను అర్థం చేసుకుంటున్నాం. అయితే దేశీయ దిగుమతులను తగ్గించడానికి, విదేశీ మారకం నిల్వలపై ఒత్తిడిని అదుపు చేయడానికి ఉన్న ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తే బాగుంటుంది. ముఖ్యంగా ఇండ్లలో నిరుపయోగంగా వేలాది టన్నుల బంగారం ఉన్నది. దాన్ని ఆకర్షణీయ పసిడి నగదీకరణ పథకం ద్వారా మార్కెట్లోకి తేగలిగితే దిగుమతుల్ని తగ్గించుకోవచ్చు.
అంతేగాని మార్కెట్లో డిమాండ్‌ను అడ్డుకోవడం సరికాదు’ అని రాజేశ్ అన్నారు. కొనుగోళ్లు తగ్గితే వ్యాపారం మందగిస్తుందని, అప్పుడు నగల తయారీ సైతం ఆగిపోతుందని.. ఇది లక్షలాది కుటుంబాలను రోడ్డున పడేస్తుందని చెప్పారు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే బంగారం కొనవద్దన్న మోదీ మాటలతో ఇండస్ట్రీపై పడే ప్రభావం గురించి ఉన్నతాధికారులు ఆయా శాఖల మంత్రులు, సర్కారీ పెద్దలతో చర్చించేందుకు ఇండస్ట్రీ వర్గాలు సమాయత్తం అవుతున్నట్టు సమాచారం.
బంగారం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి దిగుమతి సుంకాలను కేంద్రం గతంలో తగ్గించింది. ఆయా దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నది. అయితే ఇప్పుడు సుంకాలను పెంచితే మళ్లీ స్మగ్లింగ్ పెరుగుతుందని అంటున్నారు. గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ రేట్లు పెరుగుతూపోతే.. పసిడిపై దిగుమతి సుంకాలూ పెరుగుతాయని, అప్పుడు పుత్తడి అక్రమ రవాణా మళ్లీ ఊపందుకుంటుందని జ్యుయెల్లర్స్ చెప్తున్నారు. కాబట్టి సుంకాలను పెంచడం వల్ల అధికారికంగా దిగుమతి బిల్లులను తగ్గించుకున్నట్టే అవుతుందని, అనధికారికంగా కాదని అంటున్నారు. మరోవైపు దిగుమతి సుంకాల పెంపు వార్తలు.. మార్కెట్లో పుత్తడి కొనుగోళ్లకూ ఊతమిస్తుందన్న అంచనాలున్నాయి.
పసిడి కొనుగోళ్లపై ప్రధాని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరి ఆర్బీఐ ఏం చేస్తుందన్న అనుమానాలూ ఉన్నాయి. విదేశీ మారకం నిల్వల నిర్వహణపై ఆర్బీఐ ఇచ్చిన అర్ధ వార్షిక నివేదిక ప్రకారం ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి భారత్ దగ్గర 880.52 టన్నుల బంగారం ఉన్నది. ప్రస్తుతం దేశ, విదేశీ ప్రతికూల పరిస్థితుల నడుమ ఆర్థిక వ్యవస్థ భద్రతకు, పరపతికి బంగారం కీలకమని ఆర్బీఐ అంటున్నది. అందుకే ఏటా పెద్ద ఎత్తున పసిడిని కొంటున్నది. దేశీయ ఫారెక్స్ రిజర్వుల్లో పుత్తడి వాటా కూడా ఎక్కువగానే ఉన్నది.
ఆభరణాల షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. మోదీ సూచన ఈ రంగ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఇంట్రాడేలో 12 శాతం వరకు నష్టపోయిన ఆభరణాల సంస్థల షేర్లు చివరకు 10 శాతం వరకు కోల్పోయాయి. కల్యాణ్ జ్యుయెల్లర్ షేరు అత్యధికంగా 9.23 శాతం నష్టపోగా, సెన్కో గోల్డ్ శాతం, టీబీజే 7.52 శాతం, టైటాన్ 6.83 శాతం, స్కై గోల్డ్ 6.63 శాతం, థంగమాయిల్ 5.69 శాతం, పీసీ జ్యుయెల్లర్ 4.94 శాతం నష్టపోయాయి.
మోదీ మాటల నేపథ్యంలో పసిడి దిగుమతులపై సుంకం పెరుగవచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదే జరిగితే మార్కెట్లో ధరలు సరికొత్త రికార్డులకు చేరవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పసిడిపై 6 శాతం దిగుమతి సుంకం పడుతున్నది. కాగా, సుంకం పెరిగితే డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక నగలు, నాణేలు, ఇతరత్రా రూపాల్లో ఉన్న పసిడి రేట్లు పరుగులు పెడుతాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలోని డాలర్ నిల్వల పరిరక్షణకు ఇతర చమురేతర దిగుమతుల్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రం భావిస్తున్నది.
అందుకే దేశీయ దిగుమతుల్లో ముడి చమురు తర్వాతి స్థానం ఉన్న పసిడిపైనే ఫోకస్ పెట్టింది. కాగా, దేశంలోకి దుబాయ్ నుంచి ఎక్కువగా బంగారం దిగుమతి అవుతున్నది. దీంతో యూఏఈతో ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో సవరణలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే దిగుమతి సుంకాలు బాగానే పెరుగవచ్చు. రిటైల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు ఎగిసిపడటం ఖాయమే.