బుధవారం 08 జూలై 2020
Business - Jun 03, 2020 , 00:11:34

నన్ను నమ్మండి..వృద్ధికి ఢోకా లేదు

నన్ను నమ్మండి..వృద్ధికి ఢోకా లేదు

 • గాడి తప్పిన జీడీపీ తప్పక దారికొస్తుంది  
 • సీఐఐ వార్షిక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ
 • సంస్కరణల్ని ఆపబోమని స్పష్టీకరణ  
 • పరిశ్రమకు అండగా ఉంటామని హామీ

న్యూఢిల్లీ, జూన్‌ 2: గాడి తప్పిన దేశ ఆర్థిక వృద్ధిరేటు తిరిగి తప్పక దారిలోకి వస్తుందన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో చేపట్టిన సంస్కరణలు.. దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి దన్నుగా నిలుస్తాయన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. భారత క్రెడిట్‌ రేటింగ్‌ను మూడీస్‌ తగ్గించిన నేపథ్యంలో మంగళవారం ప్రధాని సీఐఐ వార్షిక సమావేశాల్లో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. గ్లోబల్‌ రేటింగ్స్‌ ఏజెన్సీ మూడీస్‌ సోమవారం దేశ సార్వభౌమ రుణ పరపతి రేటింగ్‌ను బీఏఏ2 నుంచి బీఏఏ3కి తగ్గించిన విషయం తెలిసిందే. ఈ రేటింగ్‌ నుంచి ఒక్క స్థానం (బీఏ1) దిగినా పెట్టుబడులకు ప్రతికూల దేశంగా మూడీస్‌ దృష్టిలో భారత్‌ నిలిచిపోతుంది. ఈ క్రమంలోనే మునుపటి వైభవాన్ని భారత్‌ మళ్లీ అందుకోగలదన్న ధీమాను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ సెషన్‌లో మోదీ కనబరిచారు. అసలే ఆర్థిక మందగమనంతో సతమతమవుతున్న భారత్‌ను కరోనా, లాక్‌డౌన్‌లు మరింత చిక్కుల్లో పడేశాయి. మార్చి 25 నుంచి యావత్‌ దేశం స్తంభించిపోగా.. వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో జీడీపీ అంచనాలు ఒక్కసారిగా మైనస్‌లోకి దిగజారాయి.

మరిన్ని సంస్కరణలు

సంస్కరణల్ని ఆపబోమని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు మున్ముందు మరిన్ని సంస్కరణల్ని తెస్తామన్న హామీని కూడా ఇచ్చారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో పారిశ్రామిక రంగం దేశానికి అండగా ఉండాలని, గ్రామీణ భారతాభివృద్ధిలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఓ వైపు ప్రజల ప్రాణాల్ని కాపాడుకొండూనే మరోవైపు దేశ జీడీపీని పరుగులు పెట్టించే చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అందుకోసం శ్రమిస్తున్నామన్న మోదీ.. రైతులు, చిరు వ్యాపారులు, సంస్థలు కలిసికట్టుగా ఈ లక్ష్యాన్ని చేధించగలరన్న విశ్వాసాన్ని కనబరిచారు.

వృద్ధి పురోగతి పెద్ద కష్టమేం కాదు

ఆర్థిక మందగమనం, కరోనా వైరస్‌ ఉద్ధృతి, లాక్‌డౌన్‌లతో చతికిలబడిన దేశ ఆర్థిక వృద్ధిరేటును తిరిగి పరుగులు పెట్టించడం పెద్ద కష్టమేం కాదని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వ నిర్ణయాత్మక విధానాలతో కరోనా వైరస్‌ సవాళ్లను అధిగమించి దేశం తిరిగి వృద్ధి బాట పడుతుంది’ అని నొక్కిచెప్పారు. ‘నన్ను నమ్మండి. వృద్ధిరేటు పురోగతి పెద్ద కష్టమేమీ కాదు’ అని పరిశ్రమనుద్దేశించి మాట్లాడుతూ మోదీ అన్నారు. అలాగే స్వావలంబన భారతం అంటే వ్యూహాత్మక రంగాలకు దూరంగా దేశం ఆధారపడటం కాదన్నారు.

మీతోనే ఉంటా

కరోనా వైరస్‌ ప్రపంచం ముందు చైనాను దోషిగా నిలబెడుతున్న నేపథ్యంలో అన్ని దేశాలు ఇప్పుడు ఓ నమ్మకమైన భాగస్వామి కోసం చూస్తున్నాయని మోదీ అన్నారు. వ్యాపార, పారిశ్రామిక రంగాలు కలిసివస్తే భారత్‌కు ఆ సామర్థ్యం ఉందన్నారు. ‘మీరు రెండడుగులు వేస్తే.. మీకు మద్దతుగా ప్రభుత్వం నాలుగడుగులు వేస్తుంది. ఓ ప్రధాన మంత్రిగా నేను మీతో ఉంటానని హామీ ఇస్తున్నా’ అన్నారు. వ్యాపార, పరిశ్రమలకు అనుకూలంగా బొగ్గు గనుల రంగంలో వాణిజ్య తవ్వకాలకు అనుమతిచ్చామని, అణుశక్తి తదితర రంగాల్లో ప్రైవేట్‌ రంగ పెట్టుబడులకు అవకాశం కల్పించామని చెప్పారు. తమ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని గుర్తుచేశారు.

ప్రధాని ఇంకా ఏమన్నారంటే?..

 • కరోనా వైరస్‌ కట్టడికి మేము కఠినమైన చర్యల్నే తీసుకుంటున్నాం. ఇదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ బాగు గురించీ ఆలోచిస్తున్నాం.
 • వైరస్‌పై పోరుతోపాటు ఆర్థిక వ్యవస్థ బలోపేతం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ముందున్నవి. ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాలంలో దేశానికి అండగా ఉంటాయి.
 • స్తంభించిన దేశ జీడీపీ పరుగులు లాక్‌డౌన్‌ సడలింపులతో (అన్‌లాక్‌ 1.0) మళ్లీ మొదలయ్యాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోగల సత్తా భారత్‌కు ఉన్నది.
 • దేశ ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్‌ దెబ్బతీసి ఉండవచ్చు. కానీ తిరిగి గత వైభవాన్ని భారత్‌ తప్పక అందుకుంటుంది. త్వరలోనే వృద్ధిపథంలో దూసుకుపోతుంది.
 • పీఎంజీకేవై పథకం కింద పేదలు, వలస కూలీలు, మహిళలు, వృద్ధులకు రూ.53 వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాం. ఉచిత రేషన్‌, వంటగ్యాస్‌లను ఇస్తున్నాం.
 • ఉద్దేశాలు, చేరికలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు భారత్‌ను తిరిగి వృద్ధి బాట పట్టించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
 • ఈ కష్టకాలంలో ప్రపంచం ఓ నమ్మకమైన భాగస్వామి కోసం అన్వేసిస్తున్నది. భారత్‌కు ఆ సామర్థ్యం, బలం, అర్హత ఉన్నాయి.
 • సంస్కరణలు అంటే యాదృచ్ఛిక, చెదిరిన నిర్ణయాలు కావు. అవి వ్యవస్థీకృతంగా, ప్రణాళికాబద్ధంగా, భవిష్యత్‌ కార్యచరణలో భాగంగా తీసుకునేవి.
 • నిర్మాణాత్మక సంస్కరణల్ని తెస్తాం. అవి దేశ స్వరూపాన్నే మార్చేస్తాయి. మనందరం కలిసి స్వావలంబన భారతాన్ని నిర్మిద్దాం.
 • ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్‌ అవతరించాలి. దేశంలోకి దిగుమతులను తగ్గించాలి. అదే ఆత్మ-నిర్భర్‌ భార త్‌ (స్వావలంబన భారతం) లక్ష్యం.


logo