హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : దూరదృష్టితో కూడిన పాలసీ విధానాలు దేశంలోని యువతలో దాగి ఉన్న అద్భుతమైన ఆంత్రప్రెన్యూర్ సిల్స్‌ను వెలికి తీయవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ శంషాబాద్‌లో సై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను గురువారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 2027 నాటికి గగన్ యాన్ ద్వారా భారతీయ వ్యోమగాములు అంతరిక్షంలోకి పంపాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు.
2040 నాటికి మరో చంద్రయాన్, 2035 నాటికి భారతీయ స్పేస్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలనుకుంటున్నట్టు చెప్పారు. ఇటీవల శుభాన్షు శుక్లా 18 రోజుల పాటు అంతరిక్షంలో గడిపి వచ్చారని, అలాగే చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1, నిసార్, మంగళ్ యాన్ వంటి ఆపరేషన్లతో పాటు ఒకేసారి 34 దేశాలకు చెందిన 400 కృత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం వంటి అనేక అద్భుతమైన విజయాలను సాధించామని కొనియాడారు.