Trump Tariffs | హైదరాబాద్, ఏప్రిల్ 4 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): భారత్‌పై ప్రతీకార సుంకాలు విధిస్తామంటూ అధికార పగ్గాలు చేపట్టగానే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. భారత్ ఉత్పత్తులపై 27 శాతం సుంకాలు విధిస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. టారిఫ్‌ల విషయంలో అమెరికాతో ప్రధాని మోదీ దౌత్యం ఫెయిల్ అయ్యిందని, అందుకనే భారత్‌పై అమెరికా సుంకాల మోత మోగించిందని సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఇదే విషయమై ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ను ప్రశ్నించగా దాదాపుగా ఇవే సమాధానాలు వచ్చాయి. భారత్‌పై సుంకాలు విధించకుండా ట్రంప్‌ను నిలువరించడంలో ప్రధాని మోదీ ఫెయిల్ అయ్యారా? అంటూ ఓ నెటిజన్ ‘గ్రోక్’ను ప్రశ్నించగా.. భారత్‌పై అమెరికా సుంకాలను పూర్తిగా నివారించలేకపోవడం ప్రధాని మోదీ వైఫల్యంగానే చూడవచ్చని గ్రోక్ వివరించింది.
యూఎస్-ఇండియా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి అమెరికా నుంచి దిగుమతి అయ్యే హై-ఎండ్ మోటార్ సైకిల్స్‌పై 20 శాతం మేర, బోర్బన్ విస్కీ టారిఫ్‌లను 50 శాతం మేర భారత్ తగ్గించిందన్న గ్రోక్ ఈ అంశంలోనే ఫిబ్రవరిలో మోదీ స్వయంగా ట్రంప్‌తో భేటీ అయినట్టు గుర్తు చేసింది. ఇతర టారిఫ్‌లను సమీక్షించడంతో పాటు రక్షణ పరికరాలను అగ్రరాజ్యం నుంచి కొనుగోలు చేస్తామని మోదీ ఈ సందర్భంగానే హామీనిచ్చినట్టు తెలిపింది. అయినప్పటికీ టారిఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గని ట్రంప్ భారత్ ఉత్పత్తులపై 27 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారని తెలిపింది. దీంతో సుంకాల విషయంలో అమెరికాతో ప్రధాని మోదీ దౌత్యం విఫలం అయ్యిందని, ట్రంప్‌ను మోదీ వ్యక్తిగతంగా వెళ్లి కలిసినప్పటికీ ఫలితం ఏమీ దక్కలేదని గ్రోక్ విశ్లేషించింది.
మోదీ, ట్రంప్ స్నేహంగా ఉన్నప్పటికీ, భారత్‌పై అమెరికా 27 శాతం సుంకాలు ఎందుకు విధించింది? అంటూ మరో నెటిజన్ గ్రోక్‌ను ప్రశ్నించాడు. దీనికి స్పందిస్తూ.. మోదీకి ట్రంప్ మిత్రుడైనప్పటికీ, ‘హౌడీ మోదీ’, ‘నమస్తే ట్రంప్’ వంటి ఈవెంట్లలో ఇరు దేశాధినేతలు పాల్గొన్నప్పటికీ సుంకాల విషయంలో ఇవేమీ పని చేయలేదని ‘గ్రోక్’ తేల్చి చెప్పింది. ‘అమెరికాను మళ్లీ గొప్పగా చేయాల’న్న ట్రంప్ రాజకీయ ఎజెండానే దీనికి కారణంగా వివరించింది. అమెరికా సుంకాల వాతపై ప్రధాని మోదీ మౌనంవహించడంపై ‘గ్రోక్’ను ఓ నెటిజన్ ప్రశ్నించగా.. మోదీ మౌనంపై ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయని గుర్తు చేసింది. ట్రంప్ ఒత్తిడికి మోదీ తలవంచారంటూ విపక్ష పార్టీ నేతలు మండిపడుతున్నారని గ్రోక్ విశ్లేషించింది.