Modi on Crypto’s | దేశీయంగా క్రిప్టో కరెన్సీలపై ఇన్వెస్టర్లలో మోజు పెరుగుతున్నది. క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులతో భారీ లాభాలు వస్తాయన్న ప్రకటనలు తప్పుదోవ పట్టించడమేనన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం తన అధ్యక్షతన క్రిప్టో కరెన్సీల భవితవ్యంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ నియంత్రణ లేనందున క్రిప్టో కరెన్సీలను మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్‌కు స్వర్గధామాలుగా మారేందుకు అనుమతించడానికి సర్కార్ సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీల భవితవ్యంపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
బ్లాక్‌చైన్ టెక్నాలజీతో అభివృద్ధి చెందుతున్న క్రిప్టో కరెన్సీల లావాదేవీలను నిశితంగా పరిశీలించిన మీదటే తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అన్ని వాటాదారులను విశ్వాసంలోకి తీసుకుని ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై క్రిప్టో నిపుణులు, ఇతర వాటాదారులతో చర్చలు కొనసాగిస్తుందని, గ్లోబల్ పార్టనర్షిప్తో ఉమ్మడి వ్యూహాలు అమలు చేయాల్సి అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తున్నది.
వివిధ వర్గాల ప్రతినిధులతో చర్చించడానికి ఆర్బీఐ, ఆర్థిక, హోంశాఖలు చాలా సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తాయి. దేశవ్యాప్తంగానూ, ప్రపంచ వ్యాప్త నిపుణులతోనూ చర్చిస్తారు. అంతర్జాతీయంగా అమలులో ఉన్న పద్దతులను పరిశీలిస్తారు. అయితే భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) పదేపదే క్రిప్ట్రో కరెన్సీలతో దేశ సూక్ష్మ ఆర్థిక, ద్రవ్య సుస్థిరతకు ముప్పు వాటిల్లుతుందని వాదిస్తోంది.