‘దివాలా ప్రక్రియ అంటే సంస్థ మనుగడకు కావాల్సిన వెసులుబాట్లను కల్పించడమే. ఈ కంపెనీ ఎక్కడికీ పోదు. ఎప్పట్లాగే ఇకపైనా మా నాణ్యమైన ఉత్పత్తులు మార్కెట్లో లభిస్తాయి’
-లారీ అన్ గోల్డ్‌మన్, టప్పర్‌వేర్ అధ్యక్షుడు, సీఈవో
Tupperware | న్యూయార్క్, సెప్టెంబర్ 19: ప్రముఖ ప్లాస్టిక్ కిచెన్వేర్ బ్రాండ్ టప్పర్‌వేర్ దివాలా తీసింది. అమెరికా బ్యాంక్ప్స్రీ కోర్టులో చాప్టర్ 11 బ్యాంక్ప్స్రీ రక్షణను కోరుతూ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఆహార పదార్థాల నిల్వలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన ఈ సంస్థ.. ప్రస్తుత మార్కెట్లో నెలకొన్న పోటీని తట్టుకోలేక చతికిలపడింది. పర్యావరణ పరిరక్షణపై పెరిగిన అవగాహన, ప్లాస్టిక్ వినియోగంపై మారుతున్న కస్టమర్ల అభిప్రాయాలు సైతం టప్పర్‌వేర్ అమ్మకాలకు గండి కొట్టాయి.
80 ఏండ్ల కిందట..
అమెరికాలోని ఫ్లోరిడాలోగల ఓర్లాండో ప్రధాన కేంద్రంగా 1942లో టప్పర్‌వేర్ బ్రాండ్‌ను ఎర్ల్ టప్పర్ స్థాపించారు. 1946లో మార్కెట్‌కు వీటి ఉత్పత్తులు పరిచయమయ్యాయి. అప్పట్నుంచి టప్పర్‌వేర్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతూ వచ్చింది. కానీ మార్కెట్లో పెరిగిన పోటీతో అమ్మకాలు తగ్గుముఖం పట్టడం ప్రారంభమైంది. క్లీనెక్స్, టెఫ్లాన్, ఇతర బ్రాండ్ల దూకుడు ముందు టప్పర్‌వేర్ నిలదొక్కుకోలేకపోయింది. ఇక డైరెక్ట్ సేల్స్ నుంచి వినియోగదారులు దూరం జరుగడం కూడా సంస్థ వ్యాపారాన్ని దెబ్బతీసిందని దివాలా పిటిషన్లో టప్పర్‌వేర్ పేర్కొన్నది.
పీకల్లోతు అప్పులు
దివాలా పిటిషన్ ప్రకారం టప్పర్వేర్పై రూ.10,000 కోట్ల (1.2 బిలియన్ డాలర్లు) రుణ భారం ఉన్నది. రుణదాతలతో చేసుకున్న ఒప్పందాలనూ ఇది మీరినట్టు తెలుస్తున్నది. అయితే సుమారు రూ.5,700 కోట్ల (679.5 మిలియన్ డాలర్ల) ఆస్తులు కూడా ఉన్నట్టు కంపెనీ చెప్తున్నది. ఇక ప్రస్తుతం సంస్థ ఉద్యోగుల సంఖ్య 5,500. భారత్‌తోపాటు 41 దేశాల్లో వీరంతా పనిచేస్తున్నారు. 4.65 లక్షల కన్సల్టెంట్లూ ఉన్నారు. ఫ్రీలాన్స్ బేసిస్‌లో దాదాపు 70 దేశాల్లో టప్పర్‌వేర్ ఉత్పత్తులను అమ్ముతున్నారు.
భారత్‌లో యథాతథంగానే..
అమెరికా దివాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ.. భారత్‌లో టప్పర్‌వేర్ అమ్మకాలు యథాతథంగానే సాగుతాయని సంబంధిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. దేశీయంగానే టప్పర్‌వేర్ ఉత్పత్తుల తయారీ జరుగుతున్నది కాబట్టి.. అంతర్జాతీయ మార్కెట్లో తలెత్తిన ఇబ్బందులు ఇక్కడ ప్రభావం చూపబోవని వారంటున్నారు. అంతేగాక మునుపటిలాగే విస్తరణ ఉంటుందని, కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా నాణ్యమైన ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తామని చెప్తున్నారు. ఇప్పటికే గ్లాస్, స్టీల్ ఉత్పత్తులనూ టప్పర్‌వేర్ బ్రాండ్ అమ్ముతున్న విషయం తెలిసిందే.