RBI Bomb Scare | మరో ఐదు రోజుల్లో నూతన సంవత్సర వేడుకలకు యావద్దేశం సిద్ధం అవుతున్న వేళ.. ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు ప్రధాన కార్యాలయాలకు కూడా ఈ బెదిరింపు మెసేజ్ వచ్చింది. మంగళవారం ఆర్బీఐ ఈ-మెయిల్‌కు ‘బాంబు బెదిరింపు’ మెసేజ్ వచ్చింది.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలని సదరు ఆగంతకుడు డిమాండ్ చేసినట్లు సమాచారం. ముంబైలోని 11 ప్రాంతాల్లో బాంబు పెట్టినట్లు, సదరు బాంబు మధ్యాహ్నం 1.30 గంటలకు పేలుతుందని సదరు ఈ-మెయిల్ బెదిరింపుల్లో పేర్కొన్నాడు. . ఆర్బీఐ న్యూ సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్ ఫోర్ట్, చర్చిగేట్ వద్ద గల హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హౌస్, ఐసీఐసీఐ బ్యాంకుఒ బీకేసీ టవర్స్ తదితర ప్రాంతాల్లో బాంబులు పెట్టామని తెలిపాడు.
దీంతో ముంబై పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగర పరిధిలోని ప్రధాన ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టారు. కానీ ఎక్కడా అనుమానాస్పద వస్తువులేమీ దొరకలేదు. ఈ-మెయిల్ ‘బాంబు బెదిరింపు’ నేపథ్యంలో ఎంఆర్ఏ మార్గ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
‘ప్రైవేట్ బ్యాంకులతో కలిసి దేశంలో ఆర్బీఐ పెద్ద కుంభకోణానికి పాల్పడింది. ఈ కుంభకోణంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారులు, పేరొందిన కేంద్ర మంత్రులు భాగస్వాములుగా ఉన్నారు. వారు తక్షణం రాజీనామా చేస్తే కుంభకోణం వివరాలు బయటపెడతాం’ అని ఆర్బీఐకి పంపిన ఈ-మెయిల్ ప్రకటనలో ఆగంతకుడు తెలిపాడు. మధ్యాహ్నం 1.30 గంటల లోపు వారు రాజీనామా చేయకుంటే ముంబై నగరంలో 11 చోట్ల ఏర్పాటు చేసిన బాంబులు పేలతాయని అని ఆ మెయిల్ లో తెలిపారు