పుణె, జూలై 12: ఇటలీకి చెందిన వాహన ఉత్పత్తి సంస్థ పియాజియో సబ్సిడరీ సంస్థయైన పియాజియో వెహికల్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ప్యాసింజర్ ఆటోను పరిచయం చేసింది. అపె ఎన్ఎక్స్టీ+ పేరుతో విడుదల చేసిన ఈ ప్యాసింజర్ ఆటో ధరను రూ.2.35 లక్షలు(షోరూం ధర)గా నిర్ణయించింది. మూడు రకాల్లో పెట్రోల్, సీఎన్జీ, ఎల్పీజీ లభించనున్న ఈ వాహనం గ్రామీణ ప్రాంత వాహన వినిమయాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దేశీయ కమర్షియల్ వాహన విభాగంలో అతిపెద్ద సంస్థయైన పియాజియో నూతనంగా ప్రవేశపెట్టిన ఈ ప్యాసింజర్ ఆటో లీటర్కు 50 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.
ప్రస్తుతం భారత్లో కరోనాకు సంబంధించిన పరిమితులు లేకపోయినప్పటికీ, వాహన ధరలు అధికంగా ఉండటం, ప్యాసింజర్ త్రిచక్ర వాహనాలకు రుణాల లభ్యత లేకపోవడం, చమురు ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తున్నదని పీవీపీఎల్ చైర్మన్, ఎండీ డియెగో గ్రాఫీ తెలిపారు. కంపెనీ మొత్తం వాహన విక్రయాల్లో సీఎన్జీతో నడిచే త్రిచక్ర వాహనాల వాటా సగానికి పైగా ఉన్నదని, భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉన్నదన్నారు.