న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ప్రముఖ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే.. సరికొత్త ఆరోగ్య బీమా ప్లాన్‌ను పరిచయం చేసింది. కేవలం రూ.59కే ఏడాదిపాటు డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, స్వైన్‌ఫ్లూ తదితర 10కిపైగా అనారోగ్య సమస్యలు, వ్యాధులకు రూ.5వేలదాకా ఇన్సూరెన్స్ కవరేజీనిస్తున్నది. అలాగే రూ.99కి రూ.10వేలు, రూ.199కి రూ.25 వేలు, రూ.299కి రూ.50వేలు, రూ.499కి లక్ష రూపాయల వరకు బీమా కవరేజీని పొందవచ్చు. ఈ ప్లాన్ల ద్వారా పరిమితిలోపు దవాఖాన సదుపాయం, వైద్య పరీక్షలు, ఐసీయూ/రూమ్ అద్దె ఖర్చులను పాలసీదారులు క్లెయిం చేసుకోవచ్చు.
ప్రధానంగా దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లోనివారే లక్ష్యంగా ఈ బీమాను తీసుకొచ్చామని ఫోన్‌పే చెప్తున్నది. ఉద్యోగులు సైతం తమ కంపెనీలు అందిస్తున్న గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు దీన్నో సప్లిమెంటరీగా వాడుకోవచ్చంటున్నది. చౌకగా ఆరోగ్య బీమాను పొందలేకపోతున్నవారికి ఈ ప్లాన్లు ఉపయుక్తంగా ఉంటాయని ఫోన్‌పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ సీఈవో విశాల్ గుప్తా అంటున్నారు. యూజర్లు తమ ఫోన్‌పే యాప్ ద్వారానే ఈ ప్లాన్‌ను కొని ఉపయోగించుకోవచ్చు. అలాగే క్లెయిం ఫైలింగ్ చేసుకోవచ్చు.