న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కీవ్, ఖార్కీవ్ నగరాలపై రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ఆ రెండు నగరాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఇంకా ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా సేనలు దాడులు చేస్తూనే ఉన్నాయి. ఉక్రెయిన్ సేనలు సైతం రష్యా దాడిని ధీటుగానే ఎదుర్కొంటున్నాయి. అయితే, ఈ రెండు దేశాల గొడవ కారణంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నదని తాజాగా ఓ నివేదికలో వెల్లడించారు.
ఉక్రెయిన్-రష్యా వివాదంవల్ల అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు 125 డాలర్లకు పెరిగే అవకాశం ఉన్నదని నివేదిక పేర్కొన్నది. అదేగనుక జరిగితే దేశీయంగా పెట్రోల్, డీజీల్ ధరలు లీటర్‌కు రూ.15 నుంచి 22 వరకు పెరుగుతాయని తెలిపింది. ఇప్పటికే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల పెంపు కొనసాగుతున్నది. అయితే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం పెట్రోల్ ధరలు పెరుగకుండా జాగ్రత్త పడుతున్నది.
మార్చి 7న పోలింగ్‌కు చివరిరోజు కావడంతో అదేరోజు, లేదంటే ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో దేశంలోని చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచే అవకాశం ఉన్నది. ప్రస్తుతం దేశానికి అవసరమైన క్రూడాయిల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతున్నది. కాబట్టి క్రూడాయిల్ ధర పెంపు భారత ఆర్థికవ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ చమురు ధరల పెంపు పరోక్షంగా ద్రవ్యోల్బణం మరింత పెరుగడానికి కూడా కారణమవుతుంది.
గత గురువారం బ్రెంట్ క్రూడాయిల్ ధర 119.84 డాలర్లు పలికి పదేండ్ల గరిష్ట స్థాయికి చేరింది. అయితే, శుక్రవారం 113.76 డాలర్లకు దిగివచ్చింది. కాగా, ప్రస్తుతం రష్యా క్రూడాయిల్ ఉత్పత్తిలో మూడో అతిపెద్ద దేశంగా ఉన్నది. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో అమెరికా సహా పలు యూరప్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దాంతో రష్యా నుంచి చమురు సరఫరా నిలిచిపోయి, ఇరాన్ నుంచి సరఫరా అయ్యే చమురుకు డిమాండ్ పెరిగింది.