Home Loan | సొంతింటి కల తీరిన తర్వాత.. ఆ ఇంట కనాల్సిన కలలు కళాత్మకంగా ఉండాలి! అంతేకానీ, మెత్తటి దిండు మీద తలవాల్చినా మిత్తీ మొత్తం కలవరపెట్టొద్దు! ప్రతీ ఉదయం ప్రశాంతంగా నిద్రలేవాలే కానీ, ‘అప్పు-డే’ తెల్లారిందా అని భారంగా నిట్టూర్చొద్దు. అవసరానికి వ్యక్తిగత రుణం తీసుకోవడం నేరం కాదు. ఆ రుణం మన పరపతికి మించొద్దు. వడ్డీ పరిమితిని దాటొద్దు. ఇవన్నీ సాధ్యం కావాలంటే.. రుణం ఎంతని కాదు, ఎలాంటిదో అవగాహన కలిగి ఉండాలి. బ్యాంకులో కొర్రీలకు వెరిచి నాన్‌బ్యాంకింగ్ సంస్థల తలుపు తడితే.. వడ్డీ భారం తడిసి మోపెడవ్వడం ఖాయమని గుర్తుంచుకోండి!
సొంతంగా ఒక ఇల్లు ఉండాలని చాలామంది బలంగా కోరుకుంటారు. కొందరు పైసాపైసా కూడబెట్టి ఇంటి నిర్మాణానికి కావాల్సిన నిధులను సమకూర్చుకుంటారు. ఇంకొందరు ఊళ్లో ఉన్న ఆస్తిలో కొంతభాగం అమ్మి, ఆ మొత్తంతో పట్నంలో ఇల్లు కట్టుకుంటారు. మధ్య తరగతి ఉద్యోగులు మాత్రం ఇల్లు కొనాలంటే బ్యాంకు అప్పు మీద ఆధారపడాల్సిందే! గృహ రుణం మంచి అప్పుగా పరిగణించవచ్చు. అయితే, వ్యక్తిగత రుణం విషయంలో ఆలోచించాలి. ఆ రుణం మంచిదా, మిమ్మల్ని ముంచేదా అని అంచనాకు రావాలి. సాధారణంగా వ్యక్తిగత రుణం రెడ్యూస్డ్ ఇంట్రెస్ట్, ఫ్లాట్ ఇంట్రెస్ట్ విధానంలో ఇస్తుంటారు. ఈ రెండిట్లో రెడ్యూస్ట్ ఇంట్రెస్ట్ పద్ధతి రుణగ్రహీతపై భారం తగ్గిస్తుంది. దాదాపు బ్యాంకులన్నీ ఈ ప్రక్రియను అనుసరించే రుణాలు మంజూరు చేస్తుంటాయి. ఎన్బీఎఫ్సీ (నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు) ఫ్లాట్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంటాయి.
వడ్డీ రేటులోనూ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య వ్యత్యాసం ఉంటుంది. దీనికితోడు రెడ్యూస్డ్, ఫ్లాట్ పద్ధతుల్లోనూ తేడా అధికంగానే ఉంటుంది. ఉదాహరణకు రెడ్యూస్డ్ ఇంట్రెస్ట్ కింద బ్యాంకులో లక్ష రూపాయలు రుణం తీసుకున్నాం అనుకోండి. నెలకు వాయిదా రూ.3,000గా తేలింది. మొదటి నెల వాయిదా చెల్లించిన తర్వాత అందులో రూ.2,500 వడ్డీ కింద పోగా, రూ.500 అసలు జమ చేసుకున్నారు. రెండోనెల రూ.99,500కు మాత్రమే వడ్డీ పడుతుంది. అంటే నెలలు గడిచే కొద్దీ మనం చెల్లించే వాయిదాలో వడ్డీ మొత్తం తగ్గుతూ వస్తుంది. అసలు వాటా పెరుగుతుంది. ఇక ఫ్లాట్ విధానానికి వస్తే.. 10 శాతం వడ్డీ కింద, ఐదేండ్ల కాలపరిమితికి లక్ష రూపాయలు లోన్ తీసుకున్నారు అనుకోండి! సంవత్సరానికి వడ్డీ రూ.10,000. ఐదేండ్లకు రూ.50,000. ఈ వడ్డీ మొత్తాన్ని అసలుకు కలిపి వాయిదా ఎంతనేది నిర్ణయిస్తారు. ఈ ప్రక్రియలో మనం కట్టిన అసలుకు కూడా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఫలితంగా రుణగ్రహీతపై 15 నుంచి 20 శాతం వరకు అదనపు భారం పడుతుంది. అందుకే రెడ్యూస్డ్ విధానంలో రుణం తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
Home Loan2
రెడ్యూస్డ్ విధానం ఉండగా, ఎక్కువ భారం చెల్లించాల్సి వచ్చే రెండో పద్ధతిని ఎందుకు ఎంచుకుంటారు? అంటారా! మన ఆర్థిక క్రమశిక్షణ ఇలాంటి తప్పు చేయడానికి కారణమవుతుంది. సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోతే రుణ పరపతి తగ్గుతుంది. గతంలో తీసుకున్న రుణాలు తీర్చడంలో నిర్లక్ష్యం వహించి, వాయిదాలు ఆలస్యంగా చెల్లిస్తే బ్యాంకుల్లో కావాల్సినంత అప్పు పుట్టదు. దీంతో వడ్డీ ఎక్కువైనా పర్లేదు అనుకొని ఎన్బీఎఫ్సీ తలుపు తట్టాల్సివస్తుంది. బ్యాంకులో ఉన్నన్ని షరతులు ఎన్బీఎఫ్సీల్లో ఉండవు. రుణం త్వరగా మంజూరు అవుతుంది. కానీ, లక్ష రూపాయల రుణానికే రూ.20వేల వరకూ తేడా కనిపిస్తుంటే.. రూ.10 లక్షa విషయంలో ఈ వ్యత్యాసం జీవితకాలం పూడ్చుకోలేనంత ఉండొచ్చు. అందుకే, వ్యక్తిగత రుణం తీసుకునేటప్పుడు ఎన్బీఎఫ్సీలు, ఇతర ఫైనాన్స్ కంపెనీలు కాకుండా బ్యాంకులకు ప్రాధాన్యం ఇవ్వాలి. రెడ్యూస్డ్ ఇంట్రెస్ట్ విధానాన్ని ఎంచుకోవాలి. అప్పుడే దా‘రుణ’ పరిస్థితులు ఎదురుకావు!!
బ్యాంకులకు, ఎన్‌బీఎఫ్‌సీలకు వడ్డీ రేట్లలోనూ వ్యత్యాసం కనిపిస్తుంది. బ్యాంకుల కన్నా వీటిలో రెండు నుంచి మూడున్నర శాతం అధికంగా వసూలు చేస్తుంటారు. బ్యాంకులైనా, ఎన్బీఎఫ్సీలైనా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఆధారంగా వడ్డీ రేట్లు నిర్ణయిస్తుంటాయి. ఉదాహరణకు ఎస్బీఐ వంటి ప్రభుత్వరంగ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) మీద 5.5 నుంచి 6 శాతం వరకు వడ్డీ చెల్లిస్తుంటాయి. ఈ మొత్తంలో నుంచి 7.5 శాతం నుంచి 9.5 శాతం వరకు వడ్డీ మీద రుణగ్రహీతలకు లోన్లు ఇస్తుంటాయి. అదే ఎన్బీఎఫ్సీలు ఎఫ్డీలపై 7 శాతం వరకూ వడ్డీ ఇస్తుంటాయి. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3 శాతం అనుకున్నా ఇవిచ్చే రుణాలపై వడ్డీ 10 శాతానికి పైగా ఉంటుంది. పైగా ఫ్లాట్ ఇంట్రెస్ట్ కావడంతో చెల్లించిన అసలుకూ వడ్డీ కట్టాల్సివస్తుంది.
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in, www.rpwealth.in