Personal Finance | ఆర్థిక విపణిలో రోజుకో ట్రెండ్ పుట్టుకొస్తుంటుంది. ఉన్నవారికి పెట్టుబడి మార్గాలు కావాలి. అవసరార్థులకు అప్పు పుట్టే దారులు దొరకాలి. ఈ రెండిటినీ కలిపి ఉభయ కుశలోపరి అంటున్నాయి పీర్ టు పీర్ లెండింగ్ ప్లాట్‌ఫామ్స్. షార్ట్‌గా చెప్పాలంటే పీ2పీ ప్లాట్‌ఫామ్స్. నాలుగైదు ఏండ్ల కిందటే మొదలైన పీ2పీ ఇటీవల కాలంలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇంతకూ ఏమిటీ పీ2పీ? ఇన్వెస్టర్లు దీనిపై మోజు ఎందుకు పెంచుకుంటున్నారు? రుణగ్రహీతలు ఎందుకు దీన్ని ఇంతగా నమ్ముకుంటున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే పీ2పీ కథాకమామిషు తెలుసుకోవాల్సిందే!
లక్ష్మీపతి పేరుకు తగ్గట్టే కాస్తోకూస్తో శ్రీమంతుడే. బ్యాంకు ఖాతాలో కావాల్సినంత డబ్బు ఉంది. ఉద్యోగార్జితమూ బాగానే ఉంది. పెట్టుబడి పెట్టే ఆలోచనా ఉంది. కానీ, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తేల్చుకోలేకపోతున్నాడు. ఇదే విషయమై అతని స్నేహితుడు ఉమాపతిని కలిశాడు. వీరిద్దరి సంభాషణ ఇదిగో ఇలా సాగింది..
‘ఉమాపతీ.. నీ సలహా కావాలోయ్’
‘ఈసారి ఏం పెట్టుబడి గురించి ఆలోచిస్తున్నావోయ్ లక్ష్మీపతి’
‘నన్ను చెప్పనీ.. కొంత సొమ్ముంది. దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అర్థం కావటం లేదు. ఎఫ్డీ చేద్దామంటే.. వడ్డీ బొత్తిగా ఆరు శాతమే! పోనీ మన ఆఫీసులో ఎవరికైనా అప్పుగా ఇద్దామంటే.. వడ్డీ సంగతి దేవుడెరుగు అసలు కూడా ఎగ్గొడతారని భయం’
‘రియల్ ఎస్టేట్‌లో పెట్టొచ్చు కదా!’
‘అబ్బే అంత పెద్దమొత్తం లేదు’
‘పోనీ మ్యూచువల్ ఫండ్స్ ఆలోచించ లేకపోయావా?’
‘నెలనెలా కడుతూనే ఉన్నాను. మరేదైనా మార్గం ఉంటే చెప్పు’
‘నీ సొమ్ముకు ఎఫ్డీలా పదిలంగా ఉండి, 12 శాతం రిటర్న్స్ వచ్చే మార్గం ఒకటుంది. అదే పీ2పీ’
‘పీ2పీ అంటే..’
‘నా ఫ్లోకు బ్రేకులేయకు.. ఊఁ కొట్టడానికీ వీల్లేదు!’
‘ఊఁ.. సారీ.. యూ కంటిన్యూ..’
‘పీర్ టు పీర్ లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ ఇప్పుడు ట్రెండింగ్. అప్పు ఇచ్చేవాళ్లకు, తీసుకునేవాళ్లకు వేదికగా ఇవి పుట్టుకొచ్చాయి. ఇందులో నువ్వు ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేశావే అనుకో! ఆ మొత్తాన్ని సదరు పీ2పీ సంస్థ.. వివిధ మార్గాల్లో రుణం కావాల్సినవారికి అప్పుగా ఇస్తాయన్నమాట. రుణగ్రహీత దగ్గర 16 శాతం నుంచి 20 శాతం వరకూ వడ్డీ వసూలు చేస్తాయి. నీకు మాత్రం 10-14 శాతం రిటర్న్స్‌తో ఎంచుకున్న కాలపరిమితి తీరిన తర్వాత నీకు అసలూ, వడ్డీ వచ్చేస్తుంది! ఏరా! ఏం మాట్లాడవే!?’
‘నువ్వే అన్నావు కదోయ్.. ఊఁ కూడా కొట్టొద్దని. కానీ, నాకు కొన్ని సందేహాలున్నాయి’
‘నీ పేరు సందేహాల్రావ్ అని పెట్టాల్సింది’
‘నువ్వు సందేశాల్రావ్ అని ఒప్పుకొంటాలే కానీ, రిటర్న్స్ రేటు బాగానే ఉంది కానీ, మన పెట్టుబడికి గ్యారెంటీ ఎవరిస్తారు? ఇలా అప్పులు ఇవ్వడం ప్రభుత్వం అంగీకరిస్తుందా?’
‘పీ2పీ లెండింగ్ ఆర్బీఐ నిబంధనల మేరకు జరుగుతుంది. అయితే, బ్యాంకులు దివాలా తీసిన సందర్భంలో ఖాతాదారుడి ఎఫ్డీపై రూ.5 లక్షల వరకూ ఆర్బీఐ జవాబుదారీగా ఉంటుంది. పీ2పీలో అలాంటి అవకాశం లేదు. కానీ, రుణదాతకు, గ్రహీతకు మధ్య పీ2పీ ప్లాట్‌ఫామ్ మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. నువ్వు వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేశావనుకో! ఆ మొత్తం అంతా ఒకడికే అప్పుగా ఇవ్వదు. ఓ పదిమందికి ఇస్తుంది. రుణగ్రహీతలు చెల్లించే అధిక వడ్డీలో పీ2పీ లెండర్స్ కొంత కమిషన్ తీసుకుంటుంది’
‘నాకు ఇంకో సందేహం.‘బ్యాంకులో 12 నుంచి 16 శాతం వడ్డీకి పర్సనల్ లోన్ దొరుకుతుంది కదా.. పీ2పీ ఇంట్రెస్ట్ ఎక్కువ కదా! ఇక్కడ తీసుకోవడం దేనికి?’
‘మంచి ప్రశ్న! సిబిల్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ సరిగ్గా లేనివాళ్లకు బ్యాంకులు లోన్లు ఇవ్వవు. అలాంటి వాళ్లు అధిక వడ్డీ అయినా పీ2పీలను ఆశ్రయిస్తారు!’
‘అంటే! మన సొమ్ముకు గ్యారెంటీ ఉంటుందా!’
‘కంగారు పడాల్సిందేమీ లేదు! వ్యక్తిగత రుణం అంటేనే అన్సెక్యూర్డ్ లోన్. బ్యాంకులో పర్సనల్ లోన్లు ఎగ్గొట్టే వాళ్లు ఉన్నట్టే.. ఇక్కడా ఉంటారు. పీ2పీలో ఇలా లోన్ కట్టనివాళ్ల శాతం నాలుగు మాత్రమే! ఇందాక చెప్పాను కదా! నువ్వు ఇచ్చే సొమ్ము ఒక్కడికే ఇవ్వరు. నలభై మంది వరకు ఇస్తారు. వీరిలో ఒకరిద్దరు లోన్ కట్టకపోయినా.. నీకు వచ్చిన ముప్పేం లేదు. మహా అయితే ఒకట్రెండు శాతం రిటర్న్స్ తగ్గుతుండొచ్చు’
‘అది సరే! పీ2పీలో ఎన్ని లక్షలైనా ఇన్వెస్ట్ చేయొచ్చా?’
‘ఎన్ని లక్షలు ఉన్నాయేంటి? ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం.. లెండర్ పీ2పీ ప్లాట్‌ఫామ్స్‌లో రూ.50 లక్షలకు మించి పెట్టుబడి పెట్టడానికి వీల్లేదు. రుణగ్రహీతలు రూ.10 లక్షలకు మించి అప్పు తీసుకోవడానికి వీల్లేదు’
‘ఇదేదో బాగానే ఉంది! ఒకసారి ప్రయత్నిస్తే బాగానే ఉంటుందేమో!’
‘స్నేహితుడిగా ఒక సలహా ఇవ్వనా! ఆదాయపు పన్ను పరిమితులు దృష్టిలో ఉంచుకొని ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఇందులో వచ్చే ఆదాయం ఐటీ రిటర్న్స్‌లో చూపించాల్సి ఉంటుంది! ఇంట్లో ఆదాయం లేని వ్యక్తుల పేరిట పీ2పీ లావాదేవీలు నిర్వహిస్తే ఐటీ సమస్య కూడా ఉత్పన్నం కాదు’
‘పీ2పీ ప్లాట్‌ఫామ్‌లలో మంచివేవో చెప్పు!’
‘Lendenclub, Liquiloans, Finzy, Faircent, Lendingkart, i2ifunding, i-Lend, Rupee Circle వీటిలో ప్రయత్నించు’
‘మొత్తానికి మంచి సలహా ఇచ్చావు. ఇంకోసారి ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటా!’
‘ఆల్ ద బెస్ట్ లక్ష్మీపతీ’
‘థ్యాంక్యూ..
ఉమాపతీ.
గుడ్ డే’
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in, www.rpwealth.in
Bank Auction Property | తక్కువలో వస్తుందని వేలంలో ఇల్లు కొంటున్నారా? ఈ నష్టాల గురించీ ఆలోచించండి
Reverse Mortgage Scheme | మీ ఇంటిని అద్దెకు ఇవ్వకుండానే ఇలా నెలనెలా వేలకు వేలు పొందండి
“Home Loan on Whatsapp | హోంలోన్ కావాలా.. వాట్సాప్‌లోనే అప్లయ్ చేసుకొండిలా..!”
personal finance | నెలకు రూ.15వేలు ఇన్వెస్ట్ చేస్తే కోటి రూపాయలు సంపాదించవచ్చు
CIBIL Score | సిబిల్ స్కోర్ ఒక్కటి ఉంటే లోన్ వచ్చేస్తుందని అనుకుంటే పొరపాటే..