Rotomac Pen fraud | పెన్నుల తయారీ సంస్థ రోటోమాక్పై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.750 కోట్ల మేర ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును మోసం చేసినట్లు ఆ కంపెనీపై అభియోగాలు మోపింది. అవినీతి నిరోధక చట్టంలోని పలు నిబంధనలతో పాటు నేరపూరిత కుట్ర (120-బీ), చీటింగ్ (420) కి సంబంధించిన ఐపీసీ సెక్షన్ల కింద కంపెనీ, దాని డైరెక్టర్లుగా ఉన్న సాధన కొఠారి, రాహుల్ కొఠారీలపై సీబీఐ అభియోగాలు మోపింది.
పెన్నుల తయారీలో నిమగ్నమై ఉన్న ఈ కంపెనీ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని ఏడు బ్యాంకుల కన్సార్టియంపై మొత్తం రూ.2,919 కోట్ల అప్పు కలిగిఉన్నది. ఇందులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 23 శాతం ఎక్స్పోజర్ను కలిగి ఉన్నది. 2012 జూన్ 28 న రోటోమాక్ కంపెనీకి రూ. 500 కోట్ల నాన్-ఫండ్ ఆధారిత పరిమితిని మంజూరు చేసినట్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించింది.
ఈ ఖాతా 2016 జూన్ 30న పేమెంట్లలో డిఫాల్ట్ అయిన తర్వాత రూ.750.54 కోట్ల బకాయితో నిరర్థక ఆస్తిగా ప్రకటించబడింది. కన్సార్టియం సభ్యుల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా కంపెనీ ఇప్పటికే సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చే అనేక విచారణలను ఎదుర్కొంటున్నది.