PayTM IPO | ప్రముఖ డిజిటల్ ఫైనాన్స్ పేమెంట్స్ సంస్థ పేటీఎం ఐపీవో తొలిరోజు 18 శాతం షేర్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. సోమవారం (నవంబర్ 8) ఉదయం పేటీఎం ఐపీవో ప్రారంభమైంది. 4.83 కోట్ల షేర్ల ఆఫర్‌కు 88.21 లక్షల ఈక్విటీ షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రూ.18,300 కోట్ల పెట్టుబడుల సేకరణే లక్ష్యంగా పేటీఎం ఐపీవోకు వెళ్లింది. ఇప్పటి వరకు దేశంలో ఇదే అతిపెద్ద ఐపీవో.
రిటైల్ ఇన్వెస్టర్ల కోసం పక్కన బెట్టిన షేర్లలో 78 శాతం, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల వాటాలో రెండు శాతం సబ్‌స్క్రైబ్ అయ్యాయి. ఇక క్వాలిఫైడ్ ఇన్స్ట్యిటూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ)ల్లో 2.63 కోట్ల షేర్లకు 16.78 లక్షల షేర్లు సబ్‌స్క్రైబ్ అ్యాయి. సోమవారం ఉదయం ఐపీవో ద్వారా పేటీఎం షేర్ల సేల్స్ ప్రారంభం అయ్యాయి. పేటీఎం షేర్ల సబ్స్క్రైబ్కు బుధవారంతో గడువు ముగుస్తుంది.
పేటీఎం పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ఒక్కో షేర్ రూ.2080 నుంచి రూ.2150 మధ్య విక్రయించాలని ప్రణాళిక రూపొందించింది. రిటైల్ ఇన్వెస్టర్ కనీసం ఆరు షేర్లతో కూడిన ఒక లాట్, గరిష్టంగా 15 లాట్లు కొనుగోలు చేయాలి. ఒక లాట్‌పై అప్పర్ ప్రైస్ బాండ్ రూ.12,900 పలుకుతుంది. పేటీఎం ఐపీవోలో ప్రస్తుత వాటాదారులకు రూ.10 వేల కోట్ల విలువైన షేర్లు, కొత్త వాటాదారులకు రూ.8,300 కోట్ల విలువైన షేర్లు విక్రయించనున్నది.