Paytm-SEBI | పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ షోకాజ్ నోటీసులు ఇచ్చిన వార్తలు రావడంతో సోమవారం స్టాక్ మార్కెట్లలో పేటీఎం షేర్ దాదాపు 9 శాతం పతనమైంది. పేటీఎం డైరెక్టర్లకు కూడా సెబీ నోటీసులు జారీ చేసింది. దీంతో బీఎస్ఈలో పేటీఎం షేర్ 8.8 శాతం నష్టపోయి రూ.505.25కు పడిపోయింది. 2021 నవంబర్లో ఐపీఓకు వెళ్లినప్పుడు క్లాసిఫికేషన్ నిబంధనలు పాటించలేదని పేర్కొంటూ సెబీ నోటీసు ఇచ్చినట్లు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఓ వార్తాకథనం ప్రచురించింది.
ఇంతకుముందు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్బీఐ విచారణ నివేదిక ఆధారంగా ఎంక్వైరీ ప్రారంభమైంది. సెబీకి ఐపీఓ పత్రాలు సమర్పించినప్పుడు విజయ్ శేఖర్ శర్మ .. పేటీఎం ఉద్యోగిగా కాకుండా ప్రమోటర్ గా యాజమాన్య నియంత్రణ కలిగి ఉన్నట్లు తెలిపారు. పేటీఎం సీఈఓ వైఖరిని బోర్డు సభ్యులు ఆమోదిస్తున్నారా? లేదా? తెలుపాలంటూ వారికీ సెబీ నోటీసు జారీ చేసింది. సెబీ నిబంధనల ప్రకారం దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయిన తర్వాత ప్రమోటర్లు ఎంప్లాయి స్టాక్ ఆప్షనస్ పొందడం నిషేధం.
2021లో ఐపీఓకు వెళ్లడానికి ముందే పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తన వాటాలో 5 శాతం తన కుటుంబ ట్రస్ట్ వీఎస్ఎస్ హోల్డింగ్ ట్రస్ట్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. పేటీఎంలో 14.6 శాతం వాటా గల విజయ్ శేఖర్ శర్మ వాటా.. వీఎస్ఎస్ హోల్డింగ్ ట్రస్టుకు బదిలీ చేసిన తర్వా 9.6 శాతానికి దిగి వచ్చింది. దీంతో కంపెనీ నిర్వహణ బాధ్యతలు నిర్వహించవచ్చునని పేటీఎం వర్గాలు తెలిపాయి. 10 శాతం లోపే వాటా గల వాటాదారులు కంపెనీని ప్రొఫెషనల్ గా మేనేజ్ చేయొచ్చునని తెలుస్తున్నది.