న్యూఢిల్లీ, మార్చి 1: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై భారతీయ ఆర్థిక నిఘా విభాగం (ఎఫ్ఐయు-ఇండియా) రూ.5.49 కోట్ల జరిమానా విధించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ఉల్లంఘనకుగాను ఈ ఫైన్ పడినట్టు శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై వివిధ దర్యాప్తు సంస్థల నుంచి అందుకున్న సమాచారం మేరకు ఈ మొత్తం వ్యవహారంపై ఎఫ్ఐయు-ఇండియా సమీక్ష చేస్తున్నది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్సహా అక్రమ కార్యకలాపాలు, వ్యాపారాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. నేరాలు, ఇతర చట్ట వ్యతిరేక పనులతో ఆర్జించిన సొమ్మును పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాల్లో ఉంచారన్న దానిపై దృష్టిపెట్టినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
సంక్షోభం నేపథ్యంలో..
ఆర్బీఐ ఆంక్షల నడుమ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో పేటీఎంకున్న అంతర్ సంస్థ ఒప్పందాల నిలుపుదలకు తమ బోర్డు ఆమోదించినట్టు దాని మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ శుక్రవారం తెలిపింది. దీనివల్ల ఒక సంస్థపై మరో సంస్థ ఆధారపడటం తగ్గుతుందని పేర్కొన్నది. ఫిబ్రవరి 29 నుంచి కస్టమర్ల ఖాతాల్లో డిపాజిట్లు లేదా క్రెడిట్లను అనుమతించరాదని జనవరి 31న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దాన్ని ఈ నెల 15దాకా పొడిగించిన సంగతీ విదితమే.