Elon Musk-PayTM | ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తనను తాను టెస్లా సీఈవో ఎలన్‌మస్క్‌తో సరిపోల్చుకున్నారు. తనకు, ఎలన్‌మస్క్‌కు ఉన్న సారూప్యతలను బయట పెట్టారు. ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లో ఎంటరైన తొలిరోజే గురువారం ట్రేడింగ్‌లో పేటీఎం షేర్లు 27 శాతం పతనమైన సంగతి తెలిసిందే. మూడు రోజుల విరామం తర్వాత సోమవారం కూడా పేటీఎం షేర్లు 17 శాతం పతనం అయ్యాయి. దీంతో ఐపీవో ఆఫరింగ్ ప్రైస్ రూ.2,150తో పోలిస్తే పేటీఎం స్క్రిప్ట్ ధర సుమారు 40 శాతం తగ్గిపోయింది.
ఈ నేపథ్యంలో విజయ్‌శేఖర్ శర్మ తన ఉద్యోగులతో సమావేశమయ్యారు. ప్రారంభ నష్టాలను, ఇబ్బందులను పట్టించుకోవద్దని ఉద్యోగులకు హితవు చెప్పారు. శరవేగంగా ఇంటర్నెట్ పెరిగిపోతున్న నేపథ్యంలో దేశంలోకి డిజిటల్ పేమెంట్స్ సేవలను తేవడానికి గల దీర్ఘకాలిక అవకాశాలపై దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు.
తనకు ఎలన్‌మస్క్ అంటే ఎంతో ఇష్టం అని చెప్పారు. ఇప్పుడు ప్రపంచంలోకెల్లా విద్యుత్ కార్ల సంస్థ టెస్లా మొదటి స్థానంలో ఉంటుందని, ఈ స్థానానికి రావడానికి ఎన్నో ఏండ్ల శ్రమ దాగి ఉందని అన్నారు. గతేడాది జూలైలో ప్రపంచంలోకెల్లా అత్యంత విలువైన కార్ల తయారీ సంస్థగా టయోటా మోటార్ కార్పొరేషన్‌ను టెస్లా దాటేసిందని గుర్తు చేశారు.