Pawan Hans disinvestment | కేంద్ర ప్రభుత్వం వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ ప్రక్రియ వేగవంతం చేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగ హెలికాప్టర్ సర్వీస్ ప్రొవైడర్ పవన్‌హన్స్ సంస్థలో ప్రభుత్వ వాటాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినట్లు కేంద్రం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. పవన్ హన్స్లో 51 శాతం ప్రభుత్వ వాటా.. రూ.211 కోట్లకు స్టార్9 మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు విక్రయించేందుకు సాధికారిక కేంద్ర క్యాబినెట్ గ్రూప్ ఆమోదం తెలిపింది.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో తలెత్తిన ఆర్థిక సమస్యలు, ప్రభుత్వ వ్యయంతో తలెత్తిన లోటు బడ్జెట్‌ను పూడ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను ఉపసంహరిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ హన్స్ హెలికాప్టర్ సంస్థ నష్టాల్లో చిక్కుకున్నది. ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) చమురు అన్వేషణ కార్యకలాపాలకు పవన్ హన్స్ రవాణా సేవలందించింది.
పవన్ హన్స్లో కేంద్ర ప్రభుత్వానికి 51 శాతం, ఓఎన్జీసీకి 49 శాతం వాటాలు ఉన్నాయి. ఓఎన్జీసీ కూడా తన పూర్తి వాటాను ప్రభుత్వ ఆమోదం మేరకు విక్రయించేందుకు సిద్ధమని ప్రకటించింది. గతేడాది ఎయిరిండియాను టాటా సన్స్‌కు విక్రయించిన తర్వాత కేంద్రం.. తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్, షిప్పింగ్ కార్పొరేషన్, బీఈఎంఎల్, ఐడీబీఐ బ్యాంక్, ఎల్ఐసీ ఐపీవో ద్వారా వాటాల ఉపసంహరణకు చర్యలు తీసుకుంటున్నది.