న్యూఢిల్లీ, జూన్ 3: ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వార్షిక వేతనం గత ఆర్థిక సంవత్సరం (2023-24) 17 శాతం పెరిగి రూ.66.24 కోట్లకు చేరింది. దీంతో ఐటీ పరిశ్రమలో అత్యధిక జీతం పొందుతున్న సాఫ్ట్వేర్ కంపెనీల సీఈవోల్లో పరేఖ్ కూడా చేరిపోయారు. 2022-23లో పరేఖ్ జీతం రూ.56.4 కోట్లుగా ఉన్నది. ఇన్ఫోసిస్ తాజా వార్షిక నివేదిక ప్రకారం పరేఖ్ బేస్ సాలరీ రూ.7 కోట్లు. మిగతాదానిలో స్టాక్స్, వేరియబుల్ పేమెంట్స్ ఇతరత్రా ఉన్నాయి. ఇక టీసీఎస్ సీఈవో వేతనం రూ.25 కోట్లకుపైగా ఉన్నది.
ప్రపంచ సీఈవోల్లో..
ఎస్అండ్పీ 500 కంపెనీల సీఈవోల వేతనాలు గత ఏడాది దాదాపు 13 శాతం పెరిగాయి. దీంతో సాధారణ ఉద్యోగులకు, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల జీతాలకు మధ్య వ్యత్యాసం ఇంకా పెరిగిపోయినైట్టెంది. బ్రాడ్‌కామ్ సీఈవో హాక్ టాన్ వేతనం దాదాపు 162 మిలియన్ డాలర్లుగా ఉన్నది. ఇదే అత్యధికమని ఓ తాజా సర్వేలో తేలింది. ఇదిలావుంటే 2023లో అత్యధిక జీతాలు తీసుకున్న సీఈవోల్లో మహిళల సంఖ్య పెరిగింది. అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ సీఈవో లిసా సు అగ్రస్థానంలో ఉన్నట్టు ఏపీ తెలియజేసింది.