Reliance- Paramount | వయాకాం 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో తనకు ఉన్న 13.1 శాతం వాటాలను రిలయన్స్‌కు విక్రయించేందుకు పారామౌంట్ గ్లోబల్ ఒప్పందం ఖరారు చేసుకున్నది. ఈ సంగతి రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో వెల్లడించింది. పారా మౌంట్ గ్లోబల్ వాటా విలువ రూ.4,286 కోట్లు.
అయితే, ఇటీవల రిలయన్స్, వయాకాం 18, వాల్ట్ డిస్నీ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు జాయింట్ వెంచర్ సంస్థ ఏర్పాటైన తర్వాతే రిలయన్స్ సంస్థకు తమ వాటాల కొనుగోలు ఒప్పందం అమల్లోకి వస్తుందని అమెరికా స్టాక్ ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో పారామౌంట్ గ్లోబల్ తెలిపింది. పారామౌంట్ గ్లోబల్ వాటా కొనుగోలుతో వయాకాంలో రిలయన్స్ వాటా 70.49 శాతానికి పెరుగుతుంది. రిలయన్స్‌కు తమ వాటాల విక్రయ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా వయాకాం 18కు కంటెంట్ అందిస్తామని పారామౌంట్ తెలిపింది.