పాకిస్థాన్ స్టాక్ ఎక్సేంజ్‌లో నష్టపుటేరులు పారాయి.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేసిన మెరుపుదాడులు.. దాయాది స్టాక్ మార్కెట్‌ను షేక్ చేశాయి.
ఓ దశలో సూచీ ఏకంగా 6,561 పాయింట్లు పడిపోయింది. ట్రేడింగ్‌నూ ఆపేయాల్సి వచ్చింది. అయితేచివర్లో తేరుకున్నా.. అమ్మకాల ఒత్తిడి కారణంగా భారీ నష్టాలనే మూటగట్టుకున్నది.
కరాచీ, మే 7: పాకిస్థాన్ స్టాక్ ఎక్సేంజ్ (పీఎస్ఎక్స్) కుప్పకూలింది. ఇన్వెస్టర్ల సెల్లింగ్ ప్రెషర్.. అమాంతం ఇండెక్స్‌ను పడదోసింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం అర్ధరాత్రి దాటాక భారత వైమానిక దళాలు పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఆపరేషన్ ‘సిందూర్’ పేరిట జరిగిన ఈ అటాక్స్.. దాయాది దేశం స్టాక్ మార్కెట్‌నూ ప్రభావితం చేశాయి. ఈ క్రమంలోనే బుధవారం ట్రేడింగ్‌లో పీఎస్ఎక్స్ ఏకంగా 6,500 పాయింట్లకుపైగా నష్టాలను చవిచూసింది.
భారత్ దెబ్బకు కాసేపు పీఎస్‌ఎక్స్‌లో ట్రేడింగ్‌నే ఆపేయాల్సి వచ్చిందంటే అక్కడి మదుపరులను ఆపరేషన్ ‘సిందూర్’ ఎంతలా భయపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఉదయం ఆరంభమే కేఎస్ఈ-100 సూచీ భీకర నష్టాల్లో కూరుకుపోయింది. మంగళవారం 1,13,568.51 వద్ద ముగిస్తే.. బుధవారం 1,07,296.64 దగ్గర మొదలైంది. ఇలా ఒకానొక దశలో 6,560.82 పాయింట్లు లేదా 5.78 శాతం కోల్పోయి 1,07,007.68 స్థాయికి దిగజారింది. దీంతో నష్ట నివారణలో భాగంగా వెంటనే ట్రేడింగ్‌కు విరామం ఇచ్చారు. ట్రేడింగ్ మళ్లీ మొదలైన తర్వాత కొద్దికొద్దిగా కోలుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ 3,521.50 పాయింట్లు లేదా 3.10 శాతం క్షీణించి 1,10,047.01 వద్ద ముగిసింది.
పాకిస్థాన్ స్టాక్ ఎక్సేంజ్ చరిత్రలోనే ఇంట్రా-డేలో ఈ స్థాయి నష్టాలు వాటిల్లడం ఇది రెండోసారి. గత నెల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లను ప్రకటించినప్పుడు ఒకానొక దశలో పీఎస్ఎక్స్ 8,700 పాయింట్లు క్షీణించింది. తాజాగా 6,561 పాయింట్లు కోల్పోయింది. ఇదిలావుంటే భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే స్టాక్ మార్కెట్లు మరింత పతనం కావడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత మార్కెట్ నష్టాలను ఊహించామని, ఏకేడీ సెక్యూరిటీస్‌కు చెందిన ఫాతిమా బుచా చెప్పారు. ఇంకొద్ది రోజులు మదుపరులు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారని, కాబట్టి ఒడిదొడుకు లకు వీలుందన్నారు.
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలకు గురవడంతో మదుపరులలో ధైర్యం నింపేందుకు పాకిస్థాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేయాల్సి వచ్చింది. ఇందులో దేశ ఆర్థిక సుస్థిరతను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పింది. ఆర్థిక మార్కెట్లలో ఆత్మ విశ్వాసాన్ని నింపేందుకు ప్రభావవంతమైన నిర్ణయాలుంటాయని కూడా స్పష్టం చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న నేపథ్యంలో ఉదయం సూచీలు భారీ నష్టాలకు గురైనా.. ఆ తర్వాత కోలుకున్నాయి. ఈ క్రమంలోనే బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 105.71 పాయింట్లు లేదా 0.13 శాతం పెరిగి 80,746.78 వద్ద ముగిసింది. అయితే అంతకుముందు ఓ దశలో 79,937.48 స్థాయికి దిగజారిన సూచీ.. మరో దశలో 80,844.63 వద్దకు ఎగిసింది. నిజానికి ఉదయం ఆరంభంలోనే 692 పాయింట్లు పడిపోయింది. మదుపరులు ఒకింత భయాందోళనకు గురవడంతో అమ్మకాల ఒత్తిడి తలెత్తింది.
ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 34.80 పాయింట్లు లేదా 0.14 శాతం అందుకుని 24,414.40 వద్ద నిలిచింది. ఒడిదొడుకుల నడుమ కనిష్ఠంగా 24,220కి, గరిష్ఠంగా 24,449.60కి వెళ్లింది. కాగా, ప్రైవేట్ బ్యాంకులు, టాటా మోటర్స్ తదితర ఆటో షేర్లు, రియల్టీ, మెటల్ రంగాల షేర్లూ నష్టాలను అధిగమించడంలో సూచీలకు సాయపడ్డాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ 1.36 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 1.16 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇక ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, చైనా, హాంకాంగ్ సూచీలూ లాభాల్లోనే ముగిశాయి.