దావోస్, జనవరి 20: ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల సంపద వేగంగా పెరుగుతూపోతున్నది. కొత్త బిలియనీర్లూ అంతే స్పీడుగా పుట్టుకొస్తున్నారు. గత ఏడాది సగటున వారానికి నలుగురు బిలియనీర్లు అవతరించారని ఆక్స్‌ఫామ్ తాజా నివేదిక తెలియజేసింది మరి. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వార్షిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్) సందర్భంగా ‘టేకర్స్ నాట్ మేకర్స్’ పేరిట ఆక్స్‌ఫామ్ సోమవారం ఈ నివేదికను విడుదల చేసింది. ఏటా ఈ సదస్సు తొలిరోజు అంతర్జాతీయ అసమానతలపై ఈ ప్రతిష్ఠాత్మక నివేదికను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈసారి రిపోర్టు పేరుకు తగ్గట్టుగానే.. ప్రపంచంలోని ధనికులకు, మిగతా జనాభాకు మధ్యనున్న సంపద అంతరాన్ని గట్టిగానే ఆవిష్కరించడం విశేషం.
మూడు రెట్లు వేగంగా..
2023తో పోల్చితే 2024లో ప్రపంచంలోని శ్రీమంతుల సంపద మూడు రెట్లు వేగంగా పెరగడం గమనార్హం. ప్రపంచ బిలియనీర్ల సంపద ఏకంగా ఈ ఒక్క ఏడాదే 2 లక్షల కోట్ల డాలర్లు (రూ.170 లక్షల కోట్లు) పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 మంది అత్యంత ధనవంతులు కలిసి నిరుడు రోజూ సగటున 100 మిలియన్ డాలర్లు సంపాదించారని ఆక్స్‌ఫామ్ పేర్కొన్నది. అంతేగాక వీరి సంపదలో 99 శాతం కోల్పోయినా ఇంకా వారు బిలియనీర్లుగానే ఉండొచ్చని చెప్తూ ప్రస్తుతం వారెంత ధనవంతులో చెప్పే ప్రయత్నం చేసింది. నిజానికి 2023లో రోజుకు 6.85 డాలర్ల కంటే తక్కువ ధనంతో బతుకు వెళ్లదీసినవారు 360 కోట్ల మంది అని ప్రపంచ బ్యాంక్ గణాంకాలు చెప్తున్నాయి. ప్రపంచ జనాభాలో ఇది దాదాపు సగానికి సమానం కావడం గమనార్హం. అయితే 1990 నుంచి ఆర్థిక సంక్షోభాలు, సంఘర్షణలు, వాతావరణ మార్పులు పెద్ద ఎత్తున ఉంటున్నా.. పేదరికంలో జీవిస్తున్నవారి సంఖ్య మాత్రం బాగానే తగ్గిందని చెప్పవచ్చంటూ ఆక్స్‌ఫామ్ పేర్కొన్నది.
లండన్‌పై పర్చినా మిగిలే ఉంటది
1765 నుంచి 1900 మధ్య సాగిన వలసవాదంలో భారత్ నుంచి బ్రిటన్‌కు చేరిన సంపద విలువ ఇప్పుడు 64.82 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని తాజా నివేదికలో ఆక్స్‌ఫామ్ వెల్లడించింది. ఇక ఇందులో సగానికిపైగా అక్కడున్న శ్రీమంతుల్లో 10 శాతం మంది వద్దే ఉన్నదని, దాని విలువ 33.8 ట్రిలియన్ డాలర్లుగా పేర్కొన్నది. బ్రిటీష్ 50 పౌండ్ నోట్లతో లండన్ నగరం మొత్తాన్ని నాలుగుసార్లు పరిచినా ఇంకా ఆ విలువను అందుకోలేమని ఈ సందర్భంగా ఆక్స్‌ఫామ్ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, వ్యాపారం పేరుతో భారత్‌కు వలస వచ్చిన ఆంగ్లేయులు.. ఇక్కడి అపారమైన సంపదను వారి దేశానికి కొల్లగొట్టుకుపోయారని చరిత్ర చెప్తున్న నేపథ్యంలో తాజా నివేదిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది.
ఆక్స్‌ఫామ్ నివేదిక ముఖ్యాంశాలు