న్యూఢిల్లీ : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న స్టార్టప్‌ల్లో ఇప్పుడు ఉద్యోగ భద్రత కరవైంది. భారత్‌లో అన్అకాడమీ, కార్స్ 24, వేదాంతు, మీషో, ట్రెల్, ఫుర్లెంకో వంటి ప్రముఖ స్టార్టప్‌లు ఈ ఆర్ధిక సంవత్సరం తొలి క్వార్టర్లో 5000 మందికి పైగా ఉద్యోగులపై వేటు వేయడం ఆందోళన రేకెత్తిస్తోంది. మూకుమ్మడిగా ఉద్యోగులపై వేటుకు కారణాలు ఏమిటనేది నిర్ధిష్టంగా వెల్లడి కాకున్నా ఆయా సంస్ధలు వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా సిబ్బంది తొలగింపునకు పూనుకున్నాయి.
పలు కంపెనీలు ఉద్యోగులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే విధుల నుంచి తొలగించాయి. స్టార్టప్‌లకు ఫండింగ్ వనరులు తగ్గిపోవడం కూడా ఉద్యోగులపై వేటుకు కారణంగా చెబుతున్నారు. ఇక 2022 తొలి త్రైమాసంలో ఓలా 2100 మంది ఉద్యోగులను తొలగించగా, అన్అకాడమీ 926 మంది ఉద్యోగులపై వేటు వేసింది.
కార్స్ 24 ఏకంగా 600 మంది ఉద్యోగులను, మీషో 150 మంది ఉద్యోగులను సాగనంపాయి. ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ వేదాంతులో 5900 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వీరిలో ఏడు శాతం ఉద్యోగులను కంపెనీని విడిచిపెట్టి వెళ్లాలని కోరింది. అంటే 5900 మంది ఉద్యోగుల్లో 424 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు అందాయి. సంస్ధ ఉద్యోగుల్లో ఏడు శాతం మంది మన నుంచి దూరమవుతారని కంపెనీ సీఈఓ వంశీ కృష్ణ బ్లాగ్ పోస్టులో ఉద్యోగులను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇది చాలా బాధతో తీసుకున్న నిర్ణయమని ఆయన చెప్పుకొచ్చారు.