Air Passengers | ముంబై, మార్చి 28: విమాన టికెట్లు కొనేటప్పుడు సీట్ల కోసం అదనంగా చెల్లిస్తున్నామని ఓ సర్వేలో పాల్గొన్న 44 శాతానికిపైగా ప్రయాణికులు పేర్కొన్నారు. సీటు కేటాయింపు ఫీజుగా రూ.200ల నుంచి రూ.2,000 వరకు ఇస్తున్నామని చాలామంది తెలిపారు. ఇది సదరు టికెట్ ధరలో 5 నుంచి 40 శాతం వరకు ఉందని ఈ సర్వేను చేపట్టిన లోకల్‌సర్కిల్స్ సంస్థ పేర్కొన్నది. అయితే కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కన్జ్యూమర్ రెగ్యులేటర్ సీసీపీఏ గత ఏడాది ఎయిర్‌లైన్స్‌తో దీనికి సంబంధించి సమావేశం జరిపిన నేపథ్యంలో తాజా సర్వే ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది.
కాగా, దేశవ్యాప్తంగా 339 జిల్లాల్లోని 41వేల మంది ఈ సర్వేలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. విమానాల్లో కుటుంబంతో ప్రయాణించాలన్నా, పిల్లలతో వెళ్లాలన్నా చాలామంది సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుండటంపై ఈ సర్వే దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులంతా కలిసి ఒకేచోట ప్రయాణించాలంటే టికెట్ ధరపై అదనంగా చెల్లించుకోవాల్సి వస్తుందని తేలింది. ఇక మధ్య వరుసలోని సీట్లకు తప్ప మిగతా సీట్ల కోసం, ముఖ్యంగా విండో సీట్ల కోసం ఎక్కువగా చెల్లించాల్సి వస్తున్నదని ప్రయాణికులు అంటున్నారు.