న్యూఢిల్లీ, డిసెంబర్ 27: దిగ్గజ వాహన తయారీ సంస్థ సుజుకీ మోటర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఒసాము సుజుకీ కన్నుమూశారు. గత కొంతకాలంగా లింఫోమా బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ నెల 25న తుది శ్వాస వీడిచినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఆయన వయస్సు 94 ఏండ్లు. ప్రభుత్వ సంస్థ మారుతి ఉద్యోగ్ లిమిటెడ్‌తో 1981లో ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాతి క్రమంలో మారుతి ఉద్యోగ్ లిమిటెడ్..మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్‌గా మారిపోయింది. ఈ సంస్థ నుంచి కేంద్ర సర్కార్ 2007లో పూర్తిగా వైదొలిగింది. ఈ వాటాను సుజుకీ మోటార్ కార్పొరేషన్ కొనుగోలు చేసినప్పటికీ ఇప్పటికి మారుతి పేరుతోనే విక్రయాలు కొనసాగిస్తున్నది. భారత్-జపాన్ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు జరగడంలో కీలక పాత్ర పోషించిన ఒసాముకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంగా మారుతి సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ మాట్లాడుతూ.. దార్శనికత, దూరదృష్టి, రిస్క్ తీసుకోవడానికి ఎల్లప్పుడూ ముందుండే ఒసాము మృతి ప్రపంచ ఆటోమొబైల్ రంగానికి తీరని లోటని, దేశం పట్ల లోతైన, స్థిరమైన ప్రేమకు ఆయన నిర్వచనమని వ్యాఖ్యానించారు.
ఒసాము మరణం బాధాకరం: కేటీఆర్
సుజుకీ మాజీ చైర్మన్ ఒసాము సుజుకీ మరణం బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కొన్నేండ్ల క్రితం ఆయనను కలుసుకున్నానని శుక్రవారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఆయన దయార్ధ్రత, మంచి మాటలు తనకు గుర్తుకు వస్తున్నాయని పేర్కొన్నారు.