Sam Altman – OpenAI | చాట్‌జీపీటీ (ChatGPT)ని ఆవిష్కరించడంలో కీలకంగా వ్యవహరించిన సీఈఓ శామ్ ఆల్టమన్‌ను అర్ధంతరంగా తొలగించిన ఓపెన్ ఏఐ.. తన నిర్ణయంపై పునరాలోచనలో పడిందా..? మళ్లీ సంస్థ సీఈఓగా ఆల్టమన్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందా? అంటే అవుననే అంటున్నాయి కంపెనీ వర్గాలు. బోర్డుతో సంస్థ విషయాలు షేర్ చేసుకోవడం లేదని, ఆయన పనితీరు విశ్వసనీయంగా లేదని శామ్ ఆల్టమన్ మీద ఓపెన్ ఏఐ బోర్డు అసంత్రుప్తి వ్యక్తం చేసింది. శుక్రవారం ఆయనను సీఈఓగా తొలగిస్తున్నట్లు ఓపెన్ ఏఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, ఓపెన్ఏఐ కంపెనీ బోర్డుపై ఈ విషయమై కంపెనీ ఇన్వెస్టర్లు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. శామ్ ఆల్టమన్ ఉద్వాసన నిర్ణయాన్ని ఉపసంహరించాలని కంపెనీ బోర్డును ఓపెన్ఏఐ ఇన్వెస్టర్లు కోరుతున్నారు.
ఓపెన్ ఏఐలో అతిపెద్ద వాటాదారు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్. ఈ నేపథ్యంలో కొందరు ఇన్వెస్టర్లు మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ తోనూ సంప్రదిస్తున్నారని వినికిడి. ఓపెన్ ఏఐలో మైక్రోసాఫ్ట్ బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. శామ్ ఆల్టమన్ ఉద్వాసన తర్వాత తాత్కాలిక సీఈఓగా నియమితులైన మిరా మురాటికి మద్దతు పలికినా.. ఓపెన్ ఏఐతో పని చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. అర్ధంతరంగా ఉద్వాసన పలికినప్పటి నుంచి శామ్ ఆల్టమన్ తోనూ టచ్ లో ఉన్నానని సత్య నాదెళ్ల చెప్పారు. మరోవైపు ఓపెన్ ఏఐ స్టాఫ్ కూడా మొత్తం సంస్థ బోర్డు రాజీనామా చేయాలి.. లేదా సీఈఓ శామ్ ఆల్టమన్‌ను పున:నియమించాలని ఓపెన్ ఏఐ సిబ్బందిలో ఒక వర్గం గట్టిగా పట్టుబడుతున్నట్లు సమాచారం.
ఓపెన్ ఏఐ బోర్డుతో చర్చలు విఫలమైతే శామ్ ఆల్టమన్ సొంతంగా ఏఐ వెంచర్ సంస్థ ప్రారంభించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నాడని వినికిడి. దీనికి ఓపెన్ ఏఐ మాజీ అధ్యక్షుడు గ్రేగ్ బ్రాక్ మన్ మద్దతు ఇస్తారని భావిస్తున్నారు. శుక్రవారం శామ్ ఆల్టమన్ కు ఉద్వాసన పలికిన వెంటనే సంస్థ ప్రెసిడెంట్‌గా గ్రేగ్ బ్రాక్‌మన్ వైదొలిగిన సంగతి తెలిసిందే. ఒకవేళ సొంతంగా ఏఐ వెంచర్ ప్రారంభించినా శామ్ ఆల్టమన్ మళ్లీ ఓపెన్ ఏఐలో చేరే అవకాశాలు ఉన్నాయి.