దేశంలో 76.5 కోట్లకు మొబైల్ బ్రాడ్‌బాండ్ కస్టమర్లు: నోకియా
న్యూఢిల్లీ, మార్చి 15: రోజుకు 8 గంటలు ఆన్లైన్లోనే గడిపేస్తున్నారు. దేశంలోని మిల్లేనియల్స్ (1981-1996 మధ్య జన్మించినవారు) పరిస్థితి ఇదంటూ నోకియా తాజా నివేదిక ఒకటి తెలియజేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్మార్ట్ఫోన్ల వినియోగం గణనీయంగా పెరిగిందని, దీంతో ప్రాంతీయ సమాచారం, వీడియోలతో ఆన్లైన్లో ఎక్కువగా మిల్లేనియల్స్ ఉంటున్నారని చెప్పింది. గడిచిన ఐదేండ్లలో దేశంలో మొబైల్ బ్రాడ్‌బాండ్ వినియోగదారులు రెట్టింపునకుపైగా ఎగిసి 76.5 కోట్లకు చేరారని కూడా మంగళవారం విడుదల చేసిన సదరు నివేదికలో పేర్కొన్నది.
పెరిగిన 4జీ డాటా వినియోగం..
4జీ డాటా వినియోగం 6.5 రెట్లు ఎగిసిందని, మొత్తం దేశీయ డాటా వినియోగంలో 4జీ సర్వీస్ వాటా 99 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది 5జీ సేవలు దేశంలో మొదలైనా.. ఇంకొన్నేండ్లపాటు 4జీ సర్వీస్‌దే హవా అని నోకియా ఎంబీఐటీ వార్షిక నివేదికలో పేర్కొన్నది. ఇక మొబైల్ బ్రాడ్‌బాండ్ యూజర్లు ఈ ఐదేండ్లలో 2.2 రెట్లు ఎగిశారు. కాగా, గతేడాది దేశంలోకి మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 16 కోట్లకుపైగా స్మార్ట్ఫోన్లు దిగుమతి అయ్యాయి. ఇందులో 3 కోట్ల 5జీ ఫోన్లున్నాయి. అలాగే వినియోగంలో 4జీ ఫోన్లు 80 శాతం ఉండగా, 5జీ ఫోన్లు కూడా 10 శాతానికి చేరాయి. 2017 నుంచి 2021 మధ్య మొబైల్ డాటా వినియోగం 53 శాతం ఎగబాకింది. వినియోగదారుల నెలసరి సగటు డాటా వినియోగం 3 రెట్లు పెరిగి 17 జీబీకి చేరింది. 2026 నాటికి మొత్తం మొబైల్ సర్వీస్ రెవిన్యూలో 37.7 శాతానికి సమానంగా 9 బిలియన్ డాలర్ల ఆదాయం 5జీ సర్వీసుల నుంచే వస్తుందని ఈ సందర్భంగా నోకియా అంచనా వేసింది.