MobiKwik IPO | ప్రముఖ ఫిన్ టెక్ కంపెనీ మొబిక్విక్ ఐపీఓ 119.38 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. మూడు రోజుల పాటు జరిగిన సబ్‌స్క్రిప్షన్‌లో ఇన్వెస్టర్లు భారీగా పాల్గొన్నారు. బుధవారం నుంచి ప్రారంభమైన ఐపీఓ ద్వారా రూ.572 కోట్ల నిధులు సేకరించాలని మొబిక్విక్ లక్ష్యంగా పెట్టుకుంది. 1,18,71,696 షేర్లకు గాను 1,41.72,65,686 బిడ్లు దాఖలయ్యాయని ఎన్ఎస్ఈ గణాంకాలు చెబుతున్నాయి.
రిటైల్ ఇన్డివిడ్యుయల్ ఇన్వెస్టర్లు (ఆర్ఐఐ) 134.67 రెట్లు సబ్ స్క్రిప్షన్లు దాఖలు చేస్తే, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి 119.50 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. నాన్ – ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 10.8.95 రెట్లు సబ్ స్క్రిప్షన్లు సమర్పించారు. అంతకు ముందు మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి మొబిక్విక్ సంస్థకు రూ.257 కోట్ల నిధులు లభించాయి. మొబిక్విక్ ఐపీఓలో సంస్థ షేర్ విలువ రూ.265-272గా ఖరారు చేసింది. తాజాగా ఈక్విటీ షేర్లు జారీ చేయడం ద్వారా రూ.572 కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న మొబిక్విక్ ఐపీఓకు వెళ్లడం రెండోసారి. గతంలో 2021 జూలైలో ఐపీఓకు వెళ్లాలని నిర్ణయించుకున్నా, అననుకూల మార్కెట్ పరిస్థితుల వల్ల వెనక్కు తగ్గింది.
2021 జూలైలో రూ.1,900 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో ఐపీఓ ప్రతిపాదనలు సమర్పించినా, గత జనవరిలో సెబీకి సమర్పించిన డ్రాఫ్ట్ ముసాయిదా ప్రకారం రూ.700 కోట్ల నుంచి రూ.572 కోట్లకు కుదించింది. బిపిన్ ప్రీత్ సింగ్, ఉపాసన టకూలు మొబిక్విక్ యాప్ స్థాపించారు. డిజిటల్ క్రెడిట్లో ఫైనాన్సియల్ ప్రొడక్ట్స్, ఇన్వెస్ట్ మెంట్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో మొబిక్విక్ సేవలందిస్తోంది. మొబిక్విక్ ఐపీఓ లీడ్ మేనేజర్లుగా ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్ వ్యవహరించాయి. త్వరలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో మొబిక్విక్ షేర్లు లిస్ట్ అవుతాయి.