Madhabi Puri Buch : సెబీ చీఫ్ (SEBI chief) మాధబి పురి బచ్ (Madhabi Puri Buch) ను కాంగ్రెస్ పార్టీ మరోసారి లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు మాధబి పురి బచ్, ఆమె భర్త శుక్రవారం సుదీర్ఘ వివరణ ఇచ్చారు. అయినా మరోసారి కొత్త ఆరోపణలతో కాంగ్రెస్ ముందుకొచ్చింది. మాధబి సెబీ ఛైర్ పర్సన్ హోదాలో ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారని ఆ పార్టీ నేత పవన్ ఖేరా ఆరోపణలు గుప్పించారు.
సెబీలో ఉంటూ 2017 నుంచి 2023 మధ్య లిస్టెడ్ సెక్యూరిటీల్లో రూ.36.9 కోట్లు ట్రేడింగ్ చేశారని ఖేరా ఆరోపించారు. 2018-19లో పెద్ద మొత్తంలో ట్రేడింగ్ నిర్వహించారని, విదేశీ ఫండ్స్‌లోనూ మదుపు చేశారని ఆయన అన్నారు. ఇందులో చైనాకు చెందిన పెట్టుబడులూ ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం నాలుగు అంతర్జాతీయ ఫండ్స్‌లో ఆమె మదుపు చేయగా.. అందులో చైనాకు చెందిన ‘గ్లోబల్ X MSCI చైనా కన్జూమర్’, ‘ఇన్వెస్కో చైనా టెక్నాలజీ’ ఈటీఎఫ్‌లలో ఆమె పెట్టుబడులు ఉన్నాయన్నారు.
ఈ పెట్టుబడులను ఆమె ఎప్పుడైనా ప్రకటించారా..? ఈ విషయం ప్రభుత్వ ఏజెన్సీలకు తెలుసా..? అని పవన్ ఖేరా నిలదీశారు. అలాగే సెబీ ఛైర్పర్సన్ ఇచ్చిన వివరణనూ తోసిపుచ్చారు. ముఖ్యంగా ఐసీఐసీఐ, మహీంద్రా గ్రూప్ విషయంలో ఇచ్చిన వివరణ ఏమాత్రం సరిపోదని పేర్కొన్నారు. సెబీ చీఫ్‌పై తమ పార్టీ నేత పవన్ ఖేరా తాజా ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీపై విమర్శలు ఎక్కుపెట్టింది. సెబీ ఛైర్ పర్సన్‌పై వస్తున్న ఆరోపణల గురించి మోదీకి తెలుసా..? అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ప్రశ్నించారు.
బయటకు పొక్కని సున్నితమైన ధరల సమాచారం కలిగిన లిస్టెడ్ సెక్యూరిటీల్లో సెబీ ఛైర్పర్సన్ ట్రేడింగ్ చేసిన విషయం తెలుసా..? భారత్ వెలుపల సెబీ చీఫ్‌కు పెట్టుబడులు ఉన్న విషయం తెలుసా..? అంటూ నిలదీశారు. ఒకవేళ తెలిస్తే పెట్టుబడులు, ఆయా తేదీలు చెప్పగలరా..? ఓ వైపు చైనాతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సెబీ ఛైర్పర్సన్ చైనా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన విషయం తెలుసా..? అని ప్రశ్నలు సంధించారు.