Ola Electric IPO | ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) వచ్చే వారం ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వెళ్లనున్నది. వచ్చే శుక్రవారం (ఆగస్టు 2)న రిటైల్ ఇన్వెస్టర్ల సబ్ స్క్రిప్షన్ ప్రారంభం అవుతుందని శనివారం రెగ్యులేటరీ ఫైలింగ్ లో ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఐపీఓ ద్వారా రూ.5,500 కోట్ల (657 మిలియన్ డాలర్లు) నిధులను సేకరించాలని ఓలా ఎలక్ట్రిక్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో నూతన కంపెనీల ఐపీఓల్లో ఇదే అతి పెద్దదని చెబుతున్నారు. మరో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఎథేర్ ఎనర్జీ 2024-25 ద్వితీయార్థంలో ఐపీఓకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్ భవిష్ అగర్వాల్ సంస్థలో తనకు గల 3.8 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయిస్తారని కంపెనీ తెలిపింది. ఇది గతేడాది డిసెంబర్ లో సెబీకి ఓలా ఎలక్ట్రిక్ సమర్పించిన డ్రాఫ్ట్ ముసాయిదాలో పేర్కొన్న 47.4 మిలియన్ల షేర్ల కంటే సుమారు 20 శాతం తక్కువ. అయితే, సంస్థాగత ఇన్వెస్టర్ల కోసం గురువారం నాడే తమ ఐపీఓ సబ్ స్క్రిప్షన్ ప్రారంభం అవుతుందని శనివారం సమర్పించిన రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (ఆర్‌హెచ్‌పీ)లో తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ ఆగస్టు ఆరో తేదీన ముగియనున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తమ కార్యకలాపాల ద్వారా రూ.5,009.8 కోట్ల ఆదాయం సంపాదించినట్లు తెలిపింది. 2022-23లో రూ.2,630.9 కోట్ల ఆదాయం సంపాదించింది. అయితే 2023-24లో సంస్థ రూ.1584.4 కోట్లు, 2022-23లో రూ.1472.1 కోట్ల నష్టాన్ని చవి చూసినట్లు తెలిపింది.