Ola Electric | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) మాతృసంస్థ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (Ola Electric Mobility Ltd) షేర్లు వరుసగా రెండో సెషన్ లో సోమవారం 20 శాతం వృద్ధితో అప్పర్ సర్క్యూట్ తాకాయి. శుక్రవారం ఓలా ఎలక్ట్రిక్ షేర్లు స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయ్యాయి. శుక్రవారం ఓలా షేర్ ఇష్యూ విలువ రూ.76 వద్ద ప్రారంభమైంది.
సోమవారం ఓలా ఎలక్ట్రిక్ షేర్ రూ.109.44లకు చేరుకుని డైలీ అప్పర్ సర్క్యూట్ లిమిట్ ను దాటేసింది. శుక్రవారం షేర్ విలువ రూ.91.20 వద్ద ట్రేడ్ కాగా, సోమవారం 20 శాతం పుంజుకున్నది. దీంతో రెండు రోజుల్లో ఓలా షేర్ 44 శాతం పుంజుకుంది. తద్వారా ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.48,250 కోట్లకు చేరుకున్నది.
ఐపీఓ ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయిన ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ ఈ నెల రెండో తేదీ నుంచి ఆరో తేదీ వరకూ సాగింది. కనీసం ఒక లాట్ పై 195 షేర్ల చొప్పున కొనుగోలు చేయాల్సి ఉంటుంది. షేర్ విలువ రూ.72-76 మధ్య ఆఫర్ చేసింది. షేర్లు 4.27 రెట్లు సబ్ స్క్రైబ్ కావడంతో ఐపీఓ ద్వారా ఓలా ఎలక్ట్రిక్ రూ.6,145.56 కోట్ల నిధులు సేకరించింది. గత ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఈవీ స్కూటర్లు విక్రయించిన సంస్థగా ఓలా ఎలక్ట్రిక్ నిలిచింది.