Okaya EV Scooter | ఒకాయా ఈవీ కంపెనీ తాజాగా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఫాస్ట్ ఎప్3 అనే పేరుకు తగినట్లుగానే ఈ స్కూటర్‌ను నిమిషం పాటు ఛార్జ్ చేస్తే 130 కిలోమీర్లు రయ్యిమంటూ దూసుకెళ్లవచ్చు. ఈ వాహనం గరిష్ఠ వేగం 70 కిలోమీటర్లు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.99,999 గా కంపెనీ నిర్ణయించింది.
ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ ఒకాయ ఈవీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ Okaya Faast F3 ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో అనేక అధునాతన, ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ వెబ్సైట్ నుంచి ఈ స్కూటర్‌ను బుక్ చేసుకునే వీలు కల్పించారు. ఈ స్కూటర్లో యాంటీ థెఫ్ట్ సిస్టం అందివ్వడం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. దీనిలో వీల్ లాక్ ఫీచర్‌ను కూడా పొందుపరిచారు. ఇది స్కూటర్‌ను దొంగతనం నుంచి రక్షిస్తుంది. దొంగతనం జరిగినప్పుడు లేదా లాక్ చేయబడిన స్కూటర్‌ను ఎవరైనా నెట్టడానికి ప్రయత్నించినప్పుడు చక్రాలు ఆటోమేటిక్‌గా లాక్ అవుతాయి. ఈ స్కూటర్‌ను దొంగిలించడం చాలా కష్టమైన పని అని కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు.
ఈ స్కూటర్‌ను 3.53 kWh Li-ion LFP డ్యూయల్ పోర్టబుల్ బ్యాటరీతో అందిస్తున్నారు. ఈ బ్యాటరీ వాటర్‌ప్రూఫ్, డస్ట్‌ప్రూఫ్‌గా కూడా ఉండి విపరీతమైన చలి, వేడి నుంచి కూడా బాగా పనిచేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు కేవలం 4-5 గంటల టైం సరిపోతుంది. బ్యాటరీపై 3 ఏండ్లు లేదా 30 వేల కిలోమీటర్ల ప్రయాణం గ్యారంటీని ఇస్తున్నారు. ఈ స్కూటర్ హైడ్రాలిక్ స్ప్రింగ్ షాక్ అబ్జార్వర్స్తో పాటు రీజెనరేటివ్ బ్రేకింగ్, రివర్స్ మోడ్, పార్కింగ్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ సియాన్, మ్యాట్ గ్రీన్, మెటాలిక్ గ్రే, మెటాలిక్ సిల్వర్, మెటాలిక్ వైట్ రంగుల్లో లభిస్తున్నది. ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందివ్వాలన్న లక్ష్యంతోనే ఈ స్కూటర్‌కు ప్రాణం పోసినట్లు ఒకాయ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎండీ అన్షుల్ గుప్తా తెలిపారు.