Oil Giants | ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, గ్యాస్ యుటిలిటీ సంస్థ ‘గెయిల్‘ సహా కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థలపై దేశీయ స్టాక్ ఎక్స్చేంజ్ లు జరిమాన విధించాయి. చమురు సంస్థల బోర్డుల్లో నిబంధనలకు అనుగుణంగా స్వతంత్ర, మహిళా డైరెక్టర్ల నియామకం చేపట్టడంలో విఫలమైనందుకు ఈ జరిమాన విధించాయి. ఇలా కేంద్ర చమురు సంస్థలపై స్టాక్ ఎక్స్చేంజ్ లు జరిమాన విధించడం వరుసగా ఐదో సారి.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీసీపీఎల్), ఆయిల్ ఇండియా (ఓఐఎల్), గ్యాస్ యుటిలిటీ ‘గెయిల్ (ఇండియా)’, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ (ఎంఆర్‌పీఎల్) సంస్థలపై బీఎస్ఈ, ఎన్ఎస్ఈ జరిమాన విధించాయి. జూన్ 30 లోపు నిబంధనలకు అనుగుణంగా సదరు సంస్థల బోర్డుల్లో స్వతంత్ర, మహిళా డైరెక్టర్ల నియామకంలో విఫలం అయ్యాయి. ఇదే నిబంధన అమలులో విఫలమైనందుకు కేంద్ర చమురు సంస్థలు వరుసగా ఐదు త్రైమాసికాలుగా జరిమాన చెల్లిస్తున్నాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో రూ.5,36,900 చొప్పున జరిమాన చెల్లించినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది. బీపీసీఎల్ రూ.2,41,900 చొప్పున, హెచ్‌పీసీఎల్ రూ.5,36,900 చొప్పున జరిమాన చెల్లించాయి.