NTPC Green Energy IPO | ఎన్టీపీసీ (NTPC) అనుబంధ సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ (NTPC Green Energy) ఐపీఓ (IPO) 2.40 రెట్లు సబ్ స్క్రైబ్ అయ్యింది. ఐపీఓ ద్వారా వాటాల విక్రయం శుక్రవారంతో ముగిసింది. రూ.10 వేల కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ (NTPC Green Energy) ఐపీఓకు వెళ్లింది. 59,31,67,575 షేర్లకు 1,42,65,07,242 బిడ్లు దాఖలయ్యాయి. అంటే 2.40 రెట్లు అధికంగా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ సబ్ స్క్రైబ్ అయిందని ఎన్ఎస్ఈ డేటా చెబుతోంది.
ఇక రిటైల్ ఇండివిడ్యుయల్ ఇన్వెస్టర్లు 3.39 రెట్లు సబ్స్క్రైబ్ చేశారు. క్వాలిఫైడ్ ఇన్స్ట్యూషనల్ ఇన్వెస్టర్లు 3.32 రెట్లు సబ్స్క్రైబ్ చేస్తే, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 81 శాతం సబ్స్క్రైబ్ చేశారు. యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రూ.3,960 కోట్ల నిధులు సేకరించింది. తాజా షేర్ల జారీ ద్వారా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ నిధులు సేకరించింది. ఐపీఓలో షేర్ ధర రూ.102-108గా నిర్ణయించింది.
ఐపీఓ ద్వారా సేకరించిన నిధులను ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ (ఎన్ఆర్ఈఎల్) రుణాల చెల్లింపు, కార్పొరేట్ అవసరాలకు వినియోగానికి ఖర్చు చేయనున్నది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ లీడ్ మేనేజర్లుగా ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ (మాజీ ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్), నువామా వెల్త్ మేనేజ్మెంట్ వ్యవహరించాయి.