NTPC Green Energy IPO | జాతీయ విద్యుత్ తయారీ సంస్థ ఎన్టీపీసీ (NTPC) అనుబంధ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NTPC Green Energy) ఐపీఓ తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 19న ఐపీఓ ప్రారంభమై 22న ముగుస్తుందని బుధవారం ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అధికారులు తెలిపారు. ఈ ఏడాది హ్యుండాయ్, స్విగ్గీ తర్వాత ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ అతి పెద్దది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ షేర్ ధర రూ.102-108 మధ్య ఖరారు చేసినట్లు సెబీకి రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ లో సంస్థ తెలిపింది.
రూ.10 వేల కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో ఐపీఓకు వస్తున్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ.. పది శాతం వాటాలను వాటాదారుల కోసం రిజర్వ్ చేసింది. ఇన్వెస్టర్లు కనీసం 138 ఈక్విటీ షేర్ల కోసం బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అంటే ఒక్కో ఇన్వెస్టర్ కనీసం ఒక లాట్ దాఖలు చేయడానికి రూ.14,904 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్టంగా 13 లాట్ల కోసం బిడ్ వేయొచ్చు. ఒక ఇన్వెస్టర్ ఎన్ని బిడ్లు వేసినా 138 షేర్ల కోసం బిడ్ సబ్ స్క్రిప్షన్ దాఖలు చేయాలి.
రూ.10 వేల కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓకు వెళుతున్నది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ ఆప్షన్ ఉండదు. బిడ్లు దాఖలు చేసిన ఉద్యోగులకు ఎంప్లాయి రిజర్వేషన్ పోర్షన్ కింద ఒక్కో షేర్ మీద రూ.5 డిస్కౌంట్ ఉంటుంది. ఉద్యోగుల కోసం రూ.200 కోట్ల విలువైన షేర్లు రిజర్వు చేసింది. క్వాలిఫైడ్ ఇన్ స్ట్యూషనల్ బయ్యర్లకు 75 శాతం, నాన్ ఇన్ స్ట్యూషనల్ ఇన్వెస్టర్లకు 10 శాతం షేర్లు రిజర్వు చేసింది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ మేనేజర్లుగా ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్, నువామా వెల్త్ మేనేజ్మెంట్ వ్యవహరిస్తాయి. రిజిస్ట్రార్ ఆఫ్ ఆఫర్‌గా కేఎఫ్ఐఎన్ టెక్నాలజీస్ వ్యవహరిస్తుంది.