న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: దేశంలో పురాతన స్టాక్ ఎక్సేంజ్ల్లో ఒకటైన నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్ఈ) పెట్టుబడిదారులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో రిజిస్టర్డ్ అయిన ఇన్వెస్టర్ల సంఖ్య 13 కోట్లు దాటారని సంస్థ వెల్లడించింది. క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం వల్లనే ఈ కీలక మైలురాయికి చేరుకున్నట్టు తెలిపింది. సెప్టెంబర్ 2025లో 12 కోట్ల మార్క్ దాటిన ఎన్ఎస్ఈ..మళ్లీ ఏడు నెలల తర్వాత మరో కోటి మంది పెరుగడం విశేషం.
మరోవైపు, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 25 కోట్లుగా ఉన్న క్లయింట్లు..ఏప్రిల్ చివరినాటికి 25.7 కోట్లకు చేరుకున్నట్టు తెలిపింది. తొలి కోటి మంది ఇన్వెస్టర్లకు చేరుకోవడానికి 14 ఏండ్లు పట్టగా, మరో మూడు కోట్లకు చేరుకోవడానికి మరో 11 ఏండ్లు పట్టింది. ఇటీవల కాలంలో ఆరు నుంచి ఎనిమిది నెలల్లోనే కోటి మంది జతవుతున్నారని పేర్కొంది.