Fastag Status | జాతీయ రహదారులపై కార్లతో ప్రయాణించే వారు టోల్ గేట్ల వద్ద టోల్ ఫీజు చెల్లించాలి.. టోల్ ఫీజు చెల్లింపులు వేగవంతం చేయడానికి ఆన్ లైన్ పేమెంట్స్ కోసం ‘ఫాస్టాగ్’ విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. అయితే సదరు ఫాస్టాగ్’ల నిర్వహణపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. వాహనదారులు తమ బ్యాంకుల్లో ఫాస్టాగ్’లకు కేవైసీ సమర్పించకుంటే వాటిని డీయాక్టివేట్ చేస్తామని తెలిపింది. దీనికి ఈ నెల 31వ తేదీ తుది గడువుగా నిర్దేశించింది. మీరు మీ ‘ఫాస్టాగ్’ స్టేటస్ ఏమిటో తెలుసుకునేందుకు ఏంచేయాలో తెలుసుకుందాం..!
మీ ఫాస్టాగ్’ స్టేటస్ తెలుసుకోవడానికి ఫాస్టాగ్ వెబ్సైట్.. https://fastag/ihml.com లోకి వెళ్లి మీ మొబైల్ నంబర్, అటుపై పాస్ వర్డ్ లేదా ఓటీపీ నమోదు చేసి లాగిన్ కావాలి. అటుపై డాష్ బోర్డులోకి వెళ్లి ‘మై ప్రొఫైల్ ఆప్షన్’ ఎంచుకుంటే.. మీ కేవైసీ స్టేటస్ వివరాలు కనిపిస్తాయి. మీ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకుంటే.. వెంటనే అందుకు అవసరమైన సమాచారం తెలుసుకుని అడిగిన డాక్యుమెంట్లు సమర్పించి ప్రాసెస్ పూర్తి చేస్తే మీ ఫాస్టాగ్ కేవైసీ పూర్తయినట్లే.
టోల్ ఫీజు పేమెంట్ కోసం వాహనం విండో స్క్రీన్‌పై అతికించే ‘ఫాస్టాగ్’ స్టిక్కర్లను వివిధ బ్యాంకుల శాఖలు, దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై గల టోల్ ప్లాజాలు, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, కామన్ సర్వీస్ పాయింట్లు, ట్రాన్స్ పోర్ట్ హబ్‌లు, పెట్రోల్ బంక్‌ల వద్ద విక్రయిస్తారు. వీటిని కొనుగోలు చేయాలంటే వాహన యజమానులు తమ వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), తమ ఇంటి అడ్రస్, గుర్తింపు కార్డ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో సమర్పించాలి.
ఒక వాహనానికి ఒకటి కంటే ఎక్కువ ఫాస్టాగ్’లు, ఒకే ఫాస్టాగ్’ను ఒకటి కంటే ఎక్కువ వాహనాలకు వాడుతున్నట్లు ఎన్హెచ్ఏఐ గమనించింది. కొన్నిసార్లు సంబంధిత యజమానులు కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకుండానే ‘ఫాస్టాగ్’లు జారీ అవుతున్నట్లు గుర్తించింది. ఫాస్టాగ్ స్టిక్కర్లు తీసుకున్న వాహన యజమానులు.. వెహికల్ ముందు విండో స్క్రీన్‌పై కాక తమకు ఇష్టమొచ్చిన చోట అతికించడంతో టోల్ ప్లాజాల వద్ద వాటిని స్కాన్ చేయడంలో ఆలస్యమవుతున్నది. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ‘ఒకే వాహనం – ఒకే ఫాస్టాగ్’ విధానాన్ని ఎన్హెచ్ఏఐ తీసుకొచ్చింది.