న్యూఢిల్లీ, మే 8: దేశీయ విమానయాన రంగ సంస్థ, టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిర్ ఇండియా.. వ్యయ నియంత్రణ దిశగా అడుగులేస్తున్నది. ఈ క్రమంలోనే ‘సంస్థ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. అనవసరపు ఖర్చుల జోలికి వెళ్లవద్దు’ అని శుక్రవారం ఉద్యోగులకు యాజమాన్యం సూచించింది. అలాగే ఇప్పటికైతే ఉద్యోగాల తొలగింపులేమీ ఉండబోవని భరోసా ఇచ్చిన కంపెనీ.. కనీసం మూడు నెలలపాటైనా వార్షిక వేతనాల పెంపును వాయిదా వేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసినట్టు సమాచారం. ఎయిర్ ఇండియా సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్, సీఎఫ్‌వో సంజయ్ శర్మ, చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ రవీంద్ర కుమార్ జీపీ.. టౌన్హాల్లో ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు. వీరంతా కూడా ఉద్యోగులకు దుబారాపై దృష్టి పెట్టండని నొక్కిచెప్పినట్టు తెలుస్తున్నది.
ఇదీ సంగతి..
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఓవైపు మార్కెట్లో విజృంభించిన ముడి చమురు ధరలు.. విమానయాన ఇంధనాన్ని 2.5-3 రెట్లు ఖరీదెక్కించాయి. మరోవైపు అమెరికాకు అండగా ఉంటున్నాయని పొరుగు దేశాలపై ఇరాన్ దాడులు చేస్తుండటంతో.. యూఏఈ, ఖతార్, కువైట్, సౌదీ, బహ్రెయిన్ తదితర గల్ఫ్ దేశాల్లో గగనతల ఆంక్షలు వచ్చిపడ్డాయి. ఈ ప్రభావం భారతీయ విమానయాన రంగంపై స్పష్టంగా పడుతున్నది. పెరిగిన నిర్వహణ ఖర్చులు, తగ్గిన ఆదాయం ఎయిర్‌లైన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎయిర్ ఇండియా తాజా నిర్ణయాలే ఇందుకు నిదర్శనం. నష్టాల నుంచి గట్టెక్కడానికే ఈ వ్యయ నియంత్రణ చర్యలు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాగా, గురువారం జరిగిన కంపెనీ బోర్డు సమావేశంలో తాత్కాలిక సెలవులు (ఈ సెలవులకుగాను ఉద్యోగులకు కంపెనీలు జీతాలు చెల్లించవు) సహా, వ్యయ నియంత్రణకున్న అన్ని అవకాశాలపై చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఉద్యోగులతో కంపెనీ ఉన్నతవర్గాలు పైవిధంగా చెప్పుకొచ్చాయి.
మున్ముందు కష్టాలే..
పొరుగున ఉన్న పాకిస్థాన్‌తో సరిహద్దు గొడవల దృష్ట్యా ఆ దేశ గగనతలాన్ని చాలాకాలం నుంచి వినియోగించుకోలేకపోతున్న భారతీయ విమానయాన సంస్థలకు.. గత 2 నెలలకుపైగా మెజారిటీ గల్ఫ్ దేశాలకూ స్వేచ్ఛగా వెళ్లలేని దుస్థితి తలెత్తింది. పశ్చిమాసియా సంక్షోభం.. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా తయారైంది మరి. నిజానికి దేశీయ విమానయాన పరిశ్రమకు గల్ఫ్ దేశాలకు వచ్చిపోయేవారి నుంచి పెద్ద ఎత్తునే ఆదాయం వస్తుంది. అయితే అక్కడి ఉద్రిక్తతలు ఈ బిజినెస్‌కు గండికొట్టాయి. ఇక డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయిలకు దిగజారుతుండటం కూడా విమానయాన సంస్థల కష్టాలను పెంచేస్తున్నది. ఆయా సిబ్బందికి, విదేశీ ఎయిర్‌పోర్టుల్లో వినియోగించుకున్న సేవలకుగాను చెల్లింపులు డాలర్లలోనే ఉంటాయి మరి. మొత్తానికి ఎయిర్ ఇండియా నిర్ణయాల నేపథ్యంలో ఇతర దేశీయ విమానయాన సంస్థలూ ఇదే దిశగా పయనించేందుకు ఆస్కారం ఉన్నది. ఇప్పటికే ఆయా కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరుత్సాహకరంగా వస్తున్నది చూస్తూనే ఉన్నాం. గత కొద్ది రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ తీవ్ర ఒడిదుడుకులకు షేర్లు లోనవుతున్నాయి. దీంతో భారతీయ విమానయాన పరిశ్రమకు మున్ముందు కష్టకాలమేనన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
తగ్గనున్న సర్వీసులు
గగనతల ఆంక్షలున్న, నష్టాలు వస్తున్న మార్గాల్లో విమాన సర్వీసులను తగ్గించే లేదా నిలిపివేసే యోచనలో ఎయిర్ ఇండియా ఉన్నది. ఈ మేరకు సంస్థ సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ సంకేతాలిచ్చారు. ఈ జూన్-జూలైలో విమానాల సంఖ్య తగ్గవచ్చు. ప్రస్తుతం ఎయిర్ ఇండియా దాదాపు 190 విమానాలను నడుపుతున్నది. వారానికి సుమారు 8వేల సర్వీసులు నడుస్తున్నాయి గత ఆర్థిక సంవత్సరం ఇంచుమించుగా 62 మిలియన్ల ప్రయాణికులను తీసుకెళ్లింది.
అనవసరపు ఖర్చుల జోలికి పోకండి. వీలైనంతగా పొదుపును పాటించండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికపరంగా ఎంత ఆదా? చేయగలిగితే అంతగా చేసుకోవడం మంచిది.
-క్యాంప్‌బెల్ విల్సన్, ఎయిర్ ఇండియా సీఈవో
అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలతో గత ఆర్థిక సంవత్సరం (2025-26) కంపెనీ ఆదాయం మందగించింది. అందుకే ఈ కఠిన సమయాల్లో ఖర్చులపై గట్టి నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నది.
-సంజయ్ శర్మ, ఎయిర్ ఇండియా సీఎఫ్‌వో
గత ఆర్థిక సంవత్సరానికైతే వేరియబుల్ పే ఉంటుంది. ముందుగా అనుకున్న ప్రమోషన్లూ వస్తాయి. అయితే కనీసం మూడు నెలలైనా వార్షిక ఇంక్రిమెంట్లు వాయిదా పడుతాయి. ముందస్తు తొలగింపులకు వెళ్లట్లేదు.
-రవీంద్ర కుమార్, ఎయిర్ ఇండియా చీఫ్ హెచ్ఆర్