న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19 : ఈ పండక్కి కారో, బైకో కొనాలనుకున్నారా? ఏటా ఈ సీజన్లో ఆటో సంస్థలిచ్చే ఆఫర్లకుతోడు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపు కూడా కలిసొస్తుందని ఈ నెల 22 తర్వాత కొందాంలే అనుకొని ఆగిపోయారా? అయితే మీ ఆశలు అడియాసలే కావచ్చు. అవును.. ప్రతీ సంవత్సరం దసరా, దీపావళి సందర్భంగా ఆటో ఇండస్ట్రీలో కనిపించే ఆఫర్ల సందడి ఈసారి ఉండకపోవచ్చు. జీఎస్టీ కోతల నేపథ్యంలో డిస్కౌంట్లకు దూరంగా ఉండాలని అటు వాహన తయారీ సంస్థలు, ఇటు డీలర్లు యోచిస్తున్నట్టు చెప్తున్నారు మరి. దీంతో ఈ ఏడాది పండుగ పూట రాయితీలకు అవకాశాల్లేవనే అంచనాలే గట్టిగానే వినిపిస్తున్నాయిప్పుడు. ఫలితంగా గతంతో పోల్చితే ఇప్పుడు కొత్తగా ఒనగూరే లాభం ఏమీ ఉండకపోవచ్చన్న అభిప్రాయాలే అందరి నోటా వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇటీవలి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను స్లాబులను 4 నుంచి 2కు తగ్గించిన విషయం తెలిసిందే. 12, 28 శాతం స్లాబులను ఎత్తేశారు. దీంతో వాటిలోని ఆయా ఉత్పత్తులు 5, 18 శాతం స్లాబుల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వాహనాలపై 28 శాతం నుంచి 18 శాతానికి జీఎస్టీ తగ్గుతున్నది. ఈ నెల 22 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. 4 మీటర్లకుపైగా ఉన్న ఎస్‌యూవీలపైనా జీఎస్టీ 40 శాతానికి (సెస్సు లేకుండా) తగ్గుతున్నది. ఇప్పుడు 43-50 శాతం పడుతున్నది. ట్రాక్టర్ విడిభాగాలపై జీఎస్టీ 12-18 శాతం నుంచి 5 శాతానికి దిగొస్తున్నది.
కార్లు, ద్విచక్ర వాహన తయారీదారులు ఈ పండుగ సీజన్లో గతంలో మాదిరి డిస్కౌంట్లు, ఆఫర్లను తీసుకువచ్చే వీల్లేదని, ఒకవేళ తెచ్చినా నామమాత్రంగానే అవి ఉంటాయని దేశీయ బహుళ ఆర్థిక సేవల దిగ్గజం మోతీలాల్ ఓస్వాల్ సంస్థ అంటున్నది. మార్కెట్లో డిమాండ్ పెద్ద ఎత్తున కనిపిస్తున్నదని చెప్తున్నది. ఈ క్రమంలోనే ఆటో ఇండస్ట్రీ సేల్స్‌పై తమ గత అంచనాలను సంస్థ సవరించింది కూడా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) టూవీలర్ అమ్మకాలు 4 శాతం పెరుగుతాయని, వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) 7.5 శాతం వృద్ధి ఉండొచ్చంటున్నది. మునుపు ఈ అంచనాలు వరుసగా 1 శాతం, 5.7 శాతంగానే ఉండటం గమనార్హం. అలాగే ప్యాసింజర్ కార్ సేల్స్ కూడా 3 శాతం, 8 శాతానికి పెరగొచ్చంటున్నది. గతంలో ఈ అంచనాలు 2 శాతం, 4 శాతంగానే ఉన్నాయి. ఇక వాణిజ్య వాహనాలు ఈసారికి 5 శాతం, వచ్చేసారికి 7 శాతం చొప్పున అమ్మకాలను పెంచుకోవచ్చు. ట్రాక్టర్ విక్రయాలు సైతం 10 శాతం, 6 శాతంగా ఉండొచ్చని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేస్తున్నది. మొత్తానికి జీఎస్టీ తగ్గింపు కంపెనీలకే లాభిస్తున్నదిగానీ, కస్టమర్లకు కాదు అన్న వాదనలున్నాయి.
సుజుకీ మోటర్‌సైకిల్ ఇండియా శుక్రవారం తమ అన్ని మాడల్స్పై ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. జీఎస్టీ ప్రయోజనాన్ని అందించడంలో భాగంగా గరిష్ఠంగా రూ.18,024 దాకా రేట్లను కోత పెడుతున్నట్టు చెప్పింది. ఈ నెల 22 (సోమవారం) నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయని కంపెనీ ఉపాధ్యక్షుడు దీపక్ ముత్రేజా తెలిపారు.
అమ్మకాలను పెంచుకోవడానికి భారతీయ మార్కెట్లో పండుగ సీజన్‌ను మించిన సమయం లేదంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అందుకే అన్ని రంగాల్లోని కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలపై భారీగా డిస్కౌంట్లు ప్రకటించి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. ముఖ్యంగా ఆటో రంగ సంస్థలు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవు. అందుకే పెద్ద పండగలైన దసరా, దీపావళికి కార్లు, బైకులపై ఏటేటా గొప్ప ఆఫర్లనే తెస్తాయి. తద్వారా ఒక్కసారిగా ఏర్పడే డిమాండ్‌తో డీలర్ల వద్ద ఉన్న ఇన్వెంటరీలను ఖాళీ చేస్తాయి. కానీ ఈసారి జీఎస్టీ తగ్గింపుతో మార్కెట్లో ఇప్పటికే వాహనాలకు డిమాండ్ నెలకొన్నది. దీంతో ఇక డిస్కౌంట్లు, ఆఫర్లు అనవసరమని మెజారిటీ ఆటో సంస్థలు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అదనపు రాయితీలతో వచ్చే లాభాలను ఎందుకు తగ్గించుకోవడం అన్న అభిప్రాయం ఇండస్ట్రీ అంతటా ఉన్నట్టు సమాచారం. నిజానికి చాలా సంస్థలు జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో వాహన ధరల్ని దించేశాయి. మారుతీ సుజుకీ, టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్, రెనాల్ట్, టొయోటా ఇలా అనేక కంపెనీలు రూ.10వేల దగ్గర్నుంచి రూ.3.5 లక్షలదాకా మాడల్నుబట్టి కార్ల రేట్లకు కోతలు పెట్టాయి. టూవీలర్ సంస్థలూ ఈ జాబితాలో ఉన్నాయి. దీంతో ఇక కొత్తగా మరే ఆఫర్లూ ఉండకపోవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో గత ఏడాది, అంతకుముందు సంవత్సరాల్లో పండుగ ఆఫర్లతో కొనుగోలుదారులకు అందిన ప్రయోజనాన్ని చూస్తే.. ఈ ఏడాది కూడా ఇంచుమించుగా అంతే ఉంటుందని చెప్తున్నారు.