GST | న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ఆరోగ్య బీమా పాలసీదారులకు జీఎస్టీ కౌన్సిల్ త్వరలో శుభవార్తను అందించబోతున్నది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం వసూళ్లపై జీఎస్టీని ఎత్తివేయాలని వస్తున్న డిమాండ్‌పై జీఎస్టీ కౌన్సిల్ మంత్రివర్గ ఉపసంఘం దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి శనివారం ఉపసంఘం సమావేశమై టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు, సీనియర్ సిటిజన్ల హెల్త్ బీమా ప్రీమియంపై జీఎస్టీని మినహాయింపు నివ్వాలని ఉపసంఘం సూచించింది. ఈ ఉపసంఘం సూచనలపై వచ్చే నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైన తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. టర్మ్ ఇన్సూరెన్స్‌తోపాటు రూ.5 లక్షల వరకు తీసుకునే ఆరోగ్య బీమాపై 18 శాతం జీఎస్టీని విధిస్తున్నారు. బీమా ప్రీమియంపై జీఎస్టీ ఎత్తివేతతో గండిపడనున్న ఆదాయాన్ని పూడ్చుకోవడానికి ఉపసంఘం..పలు వస్తువులపై జీఎస్టీని పెంచాలని సూచించింది. ముఖ్యంగా లగ్జరీ ఉత్పత్తులపై జీఎస్టీని 18 శాతం నుంచి 28 శాతానికి పెంచడం వల్ల రూ.22 వేల కోట్ల ఆదాయం సమకూరనున్నదని పేర్కొంది.