Nita and Akash Ambani | రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ, రిలయన్స్ జియో ఇన్ఫోకాం చైర్మన్ ఆకాశ్ అంబానీలు.. రిలయన్స్ – బోధి ట్రీ సిస్టమ్స్ యాజమాన్యంలోని వయాకాం18 బోర్డు డైరెక్టర్లుగా చేరారు. దేశంలోనే ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థగా వెలుగొందుతున్న వయాకాం 18, మరో వినోద రంగ సంస్థ వాల్ట్ డిస్నీ స్టార్ ఇండియా విలీనం ప్రక్రియ తుది దశకు చేరుకుంటున్న తరుణంలో వయాకాం 18 డైరెక్టర్లుగా నీతా అంబానీ, ఆకాశ్ అంబానీ చేరడం ప్రాధాన్యం సంతరించుకున్నది. రెండు సంస్థల సమగ్రతను పెంపొందించేందుకు వయాకాం 18 డైరెక్టర్ల బోర్డును పునర్వ్యవస్థీకరించారు. అంబానీలతోపాటు వయాకాం18 బోర్డు డైరెక్టర్లుగా బోధి ట్రీ సిస్టమ్స్ కో-ఫౌండర్ జేమ్స్ ముర్దోక్, బోధి ట్రీ లో ప్రధాన ఇన్వెస్టర్ సంస్థ ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అధారిటీ (క్యూఐఏ) మహ్మద్ అల్ హర్దాన్లను బోర్డు డైరెక్టర్లుగా నియమించారు. వీరితోపాటు రిలయన్స్ మీడియా అండ్ కంటెట్ బిజినెస్ ప్రెసిడెంట్ జ్యోతి దేశ్ పాండే, అనగ్రామ్ పార్టనర్స్ పార్టనర్ శువ మండల్ కూడా వయాకాం18లో బోర్డు డైరెక్టర్లుగా నియమితులయ్యారు.
మార్చి 31 నాటికి వయాకాం18లో ఆరుగురు డైరెక్టర్లు – అదిల్ జైనుల్ భాయ్, ఉదయ్ శంకర్, మధుసూదన శివ ప్రసాద్ పాండా, రాహుల్ జోషి, అలెగ్జాండర్ బెర్కెట్, ప్రియాంక చౌదరి ఉన్నారు.వయాకాం18లో తన 13 శాతం వాటాను పారామౌంట్ గ్లోబల్ రూ.4,286 కోట్లకు రియలన్స్కు విక్రయించడంతో అలెగ్జాండర్ బెర్కెట్ బోర్డు నుంచి నిష్క్రమిస్తారని సమాచారం. ఇక స్టార్ ఇండియా నుంచి నలుగురు డైరెక్టర్లు – అతుల్ అగర్వాల్, రిషి కన్వర్ జీత్ గైండ్, గౌరవ్ బెనర్జీ, గుర్జీవ్ సింగ్ కపూర్ ఉన్నారు. ప్రస్తుతం సోనీ పిక్చర్స్ నెట్ వర్క్ ఇండియా ఎండీ కం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా గౌరవ్ బెనర్జీ వ్యవహరిస్తున్నారు.
రెండు సంస్థల మధ్య విలీనం పూర్తయిన తర్వాత స్టార్ ఇండియా, వయాకాం18 ప్రతినిధులతో కొత్త బోర్డు ఏర్పాటవుతుంది. ఉమ్మడి సంస్థలో ఆరుగురిని రిలయన్స్, వాల్ట్ డిస్నీ ముగ్గురిని, బోధి ట్రీ ఒకరిని నామినేట్ చేస్తాయి. ఇప్పటికే వయాకాం18 యాజమాన్యం తన టీవీ చానెల్ లైసెన్సులను స్టార్ ఇండియాకు బదిలీ చేస్తూ కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ అనుమతి కోసం దరఖాస్తు చేసింది. రెండు సంస్థల విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపాయి. రెండు సంస్థల విలీనం తర్వాత ఏర్పాటయ్యే ఉమ్మడి సంస్థ మార్కెట్ విలువ 8.5 బిలియన్ డాలర్లు ఉంటుందని సమాచారం.