Nissan Magnite facelift | ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) తన సబ్-4 మీటర్ కంపాక్ట్ ఎస్యూవీ అప్డేటెడ్ మ్యాగ్నైట్ ఫేస్ లిఫ్ట్ (Nissan Magnite facelift) కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. మారుతి సుజుకి ఫ్రాంక్స్, రెనాల్ట్ కైగర్, హ్యుండాయ్ ఎక్స్ టర్, టాటా పంచ్ కార్లతో పోటీ పడుతుందీ నిస్సాన్ మ్యాగ్నైట్ ఫేస్ లిఫ్ట్. ఈ కారు ధర రూ.5.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. తొలి 10 వేల మందికి కస్టమర్లకే ఈ ధర వర్తిస్తుందని, అటుపై ధరలు సవరిస్తామని నిస్సాన్ ఇండియా తెలిపింది. ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉన్న నిస్సాన్ మ్యాగ్నైట్ టాప్ వేరియంట్ రూ.11.50 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ఈ వారం ప్రారంభంలోనే ప్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. శనివారం నుంచి డెలివరీ ప్రారంభించనున్నది నిస్సాన్.
ఈ కారులో అల్లాయ్ వీల్స్, స్పోర్ట్స్ డిజైన్ తోపాటు రేర్‌లో మోడ్రన్ లుక్ వచ్చేలా టెయిల్ ల్యాంప్ జత చేసింది నిస్సాన్. 360 డిగ్రీస్ కెమెరా, వైర్ లెస్ ఫోన్ మిర్రరింగ్, హైట్ అడ్జస్టమెంట్ డ్రైవర్ సీట్, పవర్డ్ మిర్రర్స్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, సిక్స్ స్పోక్ డ్యుయల్ టోన్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ డే టైం రన్నింగ్ లైట్ తదితర ఫీచర్లు జత కలిపింది.
లార్జర్ టచ్ స్క్రీన్ ఇన్ ఫోటైన్ మెంట్ సిస్టమ్ విత్ వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్ లెస్ ఫోన్ చార్జర్, సింగిల్ పేన్ సన్ రూఫ్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి. సేఫ్టీ కోసం ప్రామాణికంగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్)తోపాటు 55కి పైగా యాక్టివ్, పాసివ్ ఫీచర్లు ఉన్నాయి.
నిస్సాన్ మ్యాగ్నైట్ ఫేస్ లిఫ్ట్ కారు 1.0 లీటర్ల నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్నది. ఈ ఇంజిన్ గరిష్టంగా 71 బీహెచ్పీ విద్యుత్, 96 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ / ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇక 1.0 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ 100 పీఎస్ విద్యుత్, 160 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. టర్బో ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, సీవీటీ ఆప్షన్లలో లభిస్తుంది.