(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం అయితే భారత్‌కు నష్టం. ఎందుకంటే మన దేశంలో ఎగుమతుల కంటే దిగుమతుల మొత్తం ఎక్కువ. అయితే ఈ విషయాన్ని విస్మరించిన మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూపాయి విలువ క్షీణించడం ఒక విధంగా మంచిదేనంటూ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ సన్నాయి నొక్కులు నొక్కడం పట్ల పౌరులు, ఆర్థిక నిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శనివారం ప్రముఖ మీడియా సంస్థ హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించిన నాయకత్వ సదస్సులో పాల్గొన్న నిర్మల రూపాయి పతనం పూర్తిగా ప్రతికూలమేమీ కాదని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులు ఎగుమతిదారులకు ప్రయోజనకరమేనని వెల్లడించారు. ‘రూపాయి విలువ తగ్గుతున్న ఈ పరిస్థితులను మన ఎగుమతిదారులు సద్వినియోగం చేసుకొంటున్నారని నేను కచ్చితంగా చెప్పగలను. మన ఉత్పత్తులపై సుంకాలు కొనసాగుతున్న ఇలాంటి సమయంలో ఇది సానుకూలమే’ అని నిర్మల పేర్కొన్నారు.
నిర్మల వ్యాఖ్యలపై ఆర్థిక నిపుణులు, నెటిజన్లు భగ్గుమన్నారు. నిరుడితో పోలిస్తే దేశీయ ఎగుమతులు 11.8 శాతం మేర పతనమైనట్టు ఆమెకు గుర్తు చేశారు. గడిచిన అక్టోబర్‌లో ఎగుమతుల విలువ 34.38 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయని చెప్తున్నారు. ఇలాంటి సమయంలో ఎగుమతుల వల్ల ప్రయోజనాలు కూడా ఉంటాయా? అని నిర్మలను నిలదీస్తున్నారు.
పడిపోతున్న రూపాయి విలువ.. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడమే కాకుండా దిగుమతులు భారాన్ని కూడా మరింతగా పెంచుతున్నది. దేశీయ చమురు అవసరాల్లో 80 శాతానికిపైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. గత అక్టోబర్‌లో భారత్ 76.06 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకొన్నది. నిరుడు ఇదే సమయంలో పోలిస్తే, ఇది 16.63 శాతం ఎక్కువ. దేశీయ ఎగుమతులతో పోలిస్తే, దిగుమతులు డబుల్‌గా ఉన్నాయని, ఇది ఆర్థిక వ్యవస్థకు మంచిదికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎగుమతుల గురించి మాట్లాడుతున్న నిర్మల.. దిగుమతుల గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని వారు నిలదీస్తున్నారు.
అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్ఠాలకు పతనమవుతున్నది. రానున్న రోజుల్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 90.7 నుంచి 90.91 మార్క్‌కు తాకవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, ద్రవ్యోల్బణం విజృంభించే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. కేంద్రంలో మోదీ సర్కారు కొలువు దీరినప్పుడు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 58.63 వద్ద ఉన్నది. కానీ ఇప్పుడు అది 90 మార్క్‌ను దాటిపోయింది. కేంద్రం వైఫల్యాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ.. ఆర్థికమంత్రి రూపాయి పతనాన్ని కూడా సమర్థించేలా వ్యాఖ్యానించడం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.