క్యూ4 జీడీపీ డాటా, జీఎస్టీ వసూళ్లు, వాహన అమ్మకాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నివ్వడంతో…కొద్ది రోజుల నుంచి అవరోధం కల్పిస్తున్నస్థాయిని గతవారం నిఫ్టీ బ్రేక్ అవుట్ చేసింది. చివరకు 16,584 పాయింట్ల వద్ద నిలిచింది. వారంలో 232 పాయింట్లు లాభపడింది. మా ర్కెట్ లాభాలతో ముగియడం వరుసగా ఇది మూడో వారం. తదుపరి అప్‌ట్రెండ్ కొనసాగాలంటే క్రితం వారపు బ్రేక్అవుట్ స్థాయిని సూచీ రక్షించుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికాలో మే నెలలో ఉపాధి కల్పన మార్కెట్ అంచనాలకంటే అధికంగా జరిగినట్టు శుక్రవారం డాటా వెలువడిన నేపథ్యంలో ఫెడ్ రేట్ల పెంపు ప్రక్రియను వేగవంతం చేస్తుందన్న భయాలతో అక్కడి సూచీలు పతనమయ్యాయి. ఈ కారణంగా ఈ వారం గ్యాప్‌డౌన్‌తో మన మార్కెట్ మొదలయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఈ వారమే ఆర్బీఐ పరపతి సమీక్ష ఉన్నందున, సూచీలు గరిష్ఠస్థాయిలో ఒడిదుడుకులకు లోనుకావచ్చని హెచ్చరిస్తున్నారు.
16,400 పాయింట్ల మద్దతు కీలకం
ఈ వారం నిఫ్టీకి 16,400 పాయింట్ల స్థాయి కీలక మద్దతుగా నిలుస్తుందని పలువురు సాంకేతిక విశ్లేషకులు అంచనా వేశారు. ఇంతకుముందు 15,700-16,400 శ్రేణికి బ్రేక్అవుట్ స్థాయి అయినందున, తిరిగి ఇది అందించబోయే మద్దతే ముఖ్యమని, ఈ స్థాయిని కోల్పోతే ట్రెండ్ రివర్స్ అవుతుందని బీఎన్పీ పారిబా టెక్నికల్ రీసెర్చ్ హెడ్ గౌరవ్ రత్నపార్కి చెప్పారు. డెయిలీ చార్టుల్లో హయ్యర్ టాప్, హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ జరగడం బుల్లిష్ సంకేతమని, 16,400 మద్దతు సురక్షితంగా ఉంటే వచ్చే కొద్దివారాల్లో నిఫ్టీ 17,000 పాయింట్లకు చేరవచ్చన్నారు. నిఫ్టీకి తదుపరి అవరోధం 50 వారాల మూవింగ్ ఏవరేజ్ రేఖ కదులుతున్న 17,050 పాయింట్ల స్థాయి అని మరో విశ్లేషకుడు మిలన్ వైష్ణవ్ అంచనా వేశారు. ఈ వారం నిఫ్టీ 16,400 పాయింట్ల వరకూ తగ్గవచ్చని, ఆ స్థాయి వద్ద మద్దతు లభించనుండగా, 16,800 సమీపంలో అవరోధం ఉందని చాయిస్ బ్రోకింగ్ రీసెర్చ్ అనలిస్ట్ పాలక్ కొఠారి తెలిపారు.